Ambati On Three Capitals : మూడు రాజధానులపై వైఎస్ఆర్‌సీపీ నేతల గందరగోళ ప్రకటనలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సీఎం జగన్ విశాఖే్ రాజధాని అని ప్రకటించారు. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి మూడు రాజధానులు అనేది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన ప్రచారం మాత్రమేనని విశాఖ ఒక్కటే రాజధాని అని ప్రకటించారు. అయితే ఇలా బుగ్గన ప్రకటన చేస గంటలు గడవక ముందే ప్రభుత్వంలోని మరో కీలక మంత్రి అంబటి రాంబాబు.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటనను ఖండించారు. మూడు రాజధానులపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని... వైసీపీ విధానం మూడు రాజధానులేనని ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయి.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని కొత్త భాష్యం చెప్పారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చెప్పారంటే ?
బెంగళూరులో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహాక సమావేశంలో ఇన్వెస్టర్లు పారిశ్రామిక వృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదన్న- ప్రశ్నకు సమాధానంగా రాజధాని అంశంపై బుగ్గన మాట్లాడారు. రాష్ట్రానికి విశాఖపట్నం ఒకటే రాజధానిగా చేయబోతున్నామని.. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ అని చెప్పుకొచ్చారు. కర్ణాటకలోలాగే ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. ‘‘రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకోడానికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలే ప్రధాన కారణం. భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే ఐటీ ఆధారిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అక్కడ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉంది. ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ని కర్నూల్‌లో ఏర్పాటు చేస్తాం. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేం కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం’’ అని బుగ్గన మాట్లాడారు.
ఢిల్లీలో సీఎం జగన్ ఏం చెప్పారంటే ?
ఢిల్లీలో దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో రానున్న రోజుల్లో విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారనుందని..తాను కూడా అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.సీఎం జగన్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్‌సీపీ అధికారికంగా ఒక్క రాజధానికే ఫిక్స్ అయిందని తేలింది. బుగ్గన కూడా అదే్ చెబుతున్నారు.
రాజకీయంగా మాత్రం మూడు రాజధానుల ప్రకటనలు !
అయితే రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పడం వివాదానికి కారణం అవుతోంది. ఓ వైపు అధికారిక సమావేశాల్లో ఒక్కటే రాజధాని అని చెబుతున్నారు. మరో వైపు రాజకీయంగా పెట్టే ప్రెస్ మీట్లలో మూడు రాజధానులు అని ప్రకటిస్తున్నారు. 23న రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ లోపు ఏపీ సీఎం, ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రి పరస్పర విరుద్ద వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది.