Varavararao Bail : వరవరరావు కు సుప్రీంకోర్టు మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ కోరుతూ వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు. అయితే వరవర రావు చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని ఎన్ఐఏ సుప్రీంకోర్టులో వాదించింది. 83 ఏళ్ల వరవరరావు ఈ కేసులో ఇప్పటికే రెండేళ్ల జైలు శిక్ష అనుభవించారని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని, వయస్సు పెరుగుందని ఈ రెండింటితో ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశ ముందని వరవరరావు తరుపు లాయర్ నుపుర్ కుమార్ వాదించారు. వాదోపవాదాల అనంతరం బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో అరెస్ట్
అనారోగ్యం, వయస్సు , మధ్యంతర బెయిల్ ను దుర్వినియోగం చేయకపోవడం ఆధారంగా శాశ్వత మెడికల్ బెయిల్ మంజూరు చేస్తున్నామని జస్టిస్ లలిత్ తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో వరవరరావుకు ఊరట లభించినట్లయింది. మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవర రావును 2018 ఆగస్ట్ లో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లను పుణే పోలీసులు నిర్భందించారు.
అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు
వరవరరావుపై అత్యంత కఠినమైన UAPA కేసు నమోదు చేశారు. దేశంలో ఇప్పటికే..ఐదుగురి పై మాత్రమే ఈ యాక్ట్ నమోదు చేశారు. ఈ చట్టం కింద కేసులు పెట్టడానికి అరెస్టులు చేయాడనికి.. పోలీసులు ఎలాంటి సాక్ష్యాలను చూపించాల్సిన అవసరం లేదు. ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు. అందుకే వరవరరావు జైల్లోనే ఉన్నారు. అయితే గత ఏడాది మార్చిలో అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు ముంబయిలోనే ఉండాలని...విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అప్పటి నుండి తాత్కాలిక బెయిల్ లో ఉన్నారు.
మెడికల్ బెయిల్ లభించడంతో ఊరట
అనారోగ్య కారణాల కారణంగా తనకు శాశ్వత బెయిల్ కావాలని ఇప్పటికే ఆయన పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా ఈ నేపథ్యంలోనే వరవరరావుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తెలిపింది. అయితే సుప్రీంకోర్టు కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. ఈ కారణంగా వరవరరావు అనేక షరతులను పాటించాల్సి ఉంది. వాటిని ఉల్లంఘిస్తే.. మళ్లీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వరవరరావు .. విప్లవ రచయితల సంఘంలో కీలక పాత్ర పోషిస్తారు.. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా గతంలో పలు మార్లు అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేశారు. అయితే ఏ కేసులోనూ శిక్ష పడలేదు. ఎల్గార్ పరిషత్ కేసులో లభించిన ఓ ల్యాప్ ట్యాప్‌లో వరవరరావు పేరు ఉండటంతో ఆయనను అరెస్ట్ చేశారు.