Andhra News :  ఎర్రగొండపాలెంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు జరిపిన రాళ్ల దాడి అంశం వివాదాస్పదం అవుతోంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.   ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై  రాళ్ళ దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖకు  ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు.   వీఐపీ భద్రతకు సంబంధించి స్థానిక పోలీసులు స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఎర్రగొండపాలెం వస్తున్న సమయంలో ముందస్తుగానే ఘర్షణలకు కుట్ర చేశారన్న కొన్ని వీడియోలను టీడీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.  మంత్రి సురేష్ పోలీసులను ఆదేశిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 


 





 
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై 151 సీఆర్‌పీసీని ఉపయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని టీడీపీ నేతలంటున్నారు.  . ప్రతిపక్ష నేతను అణచివేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని..   ఆందోళనకారులు దాడికి ముందుగా సిద్ధమైనప్పటికీ వారిని స్థానిక పోలీసులు నిరోధించకపోవడం పట్ల టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.  చంద్రబాబుకు తగిన భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని.. వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర హోంశాఖను కోరాలని నిర్ణియంచుకున్నారు.  


 





 


మరోవైపు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై వైసీపీ రాళ్ల దాడి ఘటనపై ఎన్‌ఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాళ్ల దాడిపై ఎన్‌ఎస్‌జీ హెడ్ క్వార్టర్స్‌కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. తలపై గాయం కావడంతో కమాండెంట్‌ను అధికారులు స్కానింగ్‌కు పంపించారు. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై ఎన్‌ఎస్‌జీ బృందం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖకు కూడా ఎన్‌ఎస్జీ నివేదిక పంపే అవకాశం ఉందని  భావిస్తున్నారు.  


అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం తాము శాంతియుతంగా నిరసన తెలుపుతూంటే.. తెలుగుదేశం పార్టీ నేతలే రాళ్ల దాడి చేశారని ఆరోపిస్తున్నారు.  మంత్రి సురేష్ మీడియా సమావేశం పెట్టి కొన్ని వీడియోలు విడుదల చేశారు. అందులో టీడీపీ కండువాలు కప్పుకుని ఉన్న కొంత మంది  ఓ మూల నుంచి రాళ్లు విసురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.  టీడీపీ నేతలే రాళ్లు విసిరారని.. వైసీపీ వాళ్లెవరూ రాళ్లయలేదని సురేష్ చెబుతున్నారు.