Chandrababu Case  : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.  మంగళవారం  ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారించిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు లాయర్లు కోరారు.  చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌  , సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌ వాదనలు  వినిపించారు.  చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ విజ్ఞప్తి పరిశీలించాలనికోరారు.  కంటికి ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారన్నారు.                


చంద్రబాబు 50 రోజులుగా జైలులో రిమాండ్ లో ఉన్న అంశాన్ని న్యాయవాదులు వివరించారు. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు గతంలో ఒక కంటికి ఆపరేషన్ జరిగిందని..రెండో కంటికి ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పిన అంశాన్ని కోర్టుకు నివేదించారు. హైకోర్టుకు దసరా సెలవులకు ముందు పదే పదే బెయిల్ పిటిషన్లపై వాయిదాలు పడ్డాయి. తర్వాత విచారణ వాయిదా వేశారు. వెకేషన్ బెంచ్ లో విచారణ జరిగినా న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పటంతో కేసు వాయిదా పడింది. ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.                 


హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసారు. చంద్రబాబు ను అరెస్ట్ చేసిన తరువాత ఈ 50 రోజుల్లో కొత్తగా పురోగతి లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అదే సమయంలో కొత్తగా ఆరోపణలు కూడా లేవని వివరించారు. చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ తో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై వాదనలు  వినిపించేందుకు చంద్రబాబు తరపులాయర్ సిద్ధార్థ లూధ్రా సిద్ధమయ్యారు. అయితే.. సీఐడీ తరపు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమకు సమయం కావాలని కోరారు. దీంతో వాదనలు ఎప్పుడు వినాలన్న అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు.                             


ఇప్పటికే తనపై నమోదైన కేసుల్లో సెక్షన్ 17A వర్తిస్తుందని తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ పూర్తి అయింది. తీర్పు రిజర్వ్ అయింది.  నవంబర్ ఎనిమిదో తేదీ లోపు తీర్పు వెలువడే అవకాశం ఉంది.