Bridge Construction in Tirumala Walk Way: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వైకుంఠ వాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అధిక శాతం భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. కొందరు శ్రీవారి మెట్టు మార్గంలో వస్తే.. మరికొందరు అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. ఓ వైపు అడవి, మరోవైపు సుందర ప్రకృతి దృశ్యాలను చూస్తూ.. గోవింద నామస్మరణతో భక్తులు స్వామి దర్శనానికి తరలివస్తారు. అయితే, గతంలో నడక మార్గంలో చిరుత సంచారం ఆందోళన కలిగించిన నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ఆయా ప్రాంతాల్లో టీటీడీ అధికారులు ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు సైతం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.


అక్కడ వంతెన నిర్మాణం


తిరుమలకు నడక మార్గంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. అక్కడ నుంచి రోడ్డు మార్గం మోకాలి మెట్టు వరకు ఉంటుంది. ఈ మార్గంలో భక్తులు కాలినడకన రోడ్డుపై ప్రయాణించాల్సి ఉంది. మరో వైపు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు సైతం ఈ దారిలోనే వస్తుంటాయి. రోడ్డు పల్లంగా (డౌన్) గా ఉండడంతో వాహనాలు వేగంగా వస్తుంటాయి. గతంలో పలు సందర్భాల్లో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో టీటీడీ బోర్డు ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేయాలని సంకల్పించింది. అధికారులు అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు.


రూ.70 లక్షలతో..


ప్రమాదాలు నివారించేలా భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ చర్యలు చేపట్టింది. టెంపుల్ ఆర్చీ నుంచి రోడ్డు దాటేందుకు రూ.70 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. అందుకు సంబంధించి పనులు సైతం ప్రారంభించారు. భక్తులు రోడ్డుపైకి వెళ్లే అవసరం లేకుండా వంతెనపై రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ లోకి చేరుకునేలా దీని నిర్మాణం చేస్తున్నారు. భక్తులు ఈ వంతెన దాటి 1.5 కిలో మీటర్ల రోడ్డుపై నడిచి మోకాలి మెట్టు చేరుకుంటారు. దీంతో పల్లపు ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తులు సురక్షితంగా ఆలయానికి చేరుకుంటారు. ఏప్రిల్ చివరి నాటికి ఈ పనులు పూర్తి చేసి వంతెనను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు స్పష్టం చేశారు.


వైభవంగా బ్రహ్మోత్సవాలు


మరోవైపు, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం ధ్వజారోహణం ఘట్టంతో వేద పండితుల మంత్రోఛ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ వేడుక శాస్త్రోక్తంగా సాగింది. అంతకు ముందు ఉదయం స్వామి వారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుక ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామి వారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ట, రక్షా బంధనం చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.


Also Read: జగన్‌ను అదః పాతాళానికి తొక్కుతాం, సలహాలు ఇచ్చే వాళ్లు వద్దు- యుద్ధం చేసే వాళ్లే నాతో రండి: పవన్