AP Railway Projects : ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఏపీలో 70వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయని కానీ అవన్నీ ఆగిపోయాయన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటాయించాల్సిన నిధులను కేటాయించకపోవడమే కారణమని కేంద్ర మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు.
ఏపీ రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కోరుతున్న ఎంపీ... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి సహకరించేలా చేస్తే... ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు అయినా త్వరితగతిన పూర్తి అవుతాయని మంత్రి వివరించారు. ఏపీలో ప్రస్తుతం రూ.70 వేల కోట్లకు పైగా విలువ కలిగిన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని వైష్ణవ్ తెలిపారు.
కొత్త ప్రాజెక్టులను కాస్ట్ షేరింగ్ పద్దతిన చేపడుతున్నట్లు వెల్లడించిన మంత్రి... ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఏపీ తన వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా ఏపీకి కొత్తగా రైల్వే ప్రాజెక్టులను ప్రకటించడం సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీనే ప్రశ్న అడిగి మరీ ఈ విషయాన్ని బయట పెట్టించడం చర్చనీయాంశంగా మారింది.
కాంప్లెక్స్ ను కూల్చేస్తానంటూ జేసీ ప్రభాకర్ మాస్ వార్నింగ్!
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి చాలా వరకూ పనులు గత మూడేళ్లుగా ఆగిపోయాయి. బడ్జెట్ సమయంలో పెట్టే సమావేశాల్లో ఏపీ ఎంపలు పలు రకాల ప్రతిపాదనలు ఇస్తారు. కానీ ప్రభుత్వం తమ వాటా చెల్లించకపోవడంతో ఒక్క ప్రాజెక్ట్ కూడా మందుకు పడటం లేదు.