Andhra Telangana News :  విభజన చట్టంలోని అంశాలను నేరవేర్చిన అంశంపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక  సమాధానాలు ఇచ్చారు.   మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు దీర్ఘకాలిక ప్రాజెక్టులని ..వాటికి నిధులు ప్రతీ ఏడాది కేటాయిస్తామన్నారు. ఒక్క సారిగా నిధులు కేటాయించబోమని ఆయన చెప్పారు.  రూ.106 కోట్లతో సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌ కార్యాలయం నిర్మిస్తామని స్పష్టం చేశారు.  ఇందుకోసం 2023-24లో రూ.10కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదన్నారు. సమీప పోర్టుల నుంచి ఉన్న తీవ్ర పోటీ వల్ల ఇది ఆచరణ సాధ్యం కాలేదన్నారు. 


కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదన్న కేంద్రం 


రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సూచించిందన్నారు. రామాయపట్నం నాన్‌- మేజర్‌ పోర్టుగా ఇప్పటికే నోటిఫై చేశారన్న కేంద్రం.. రామాయపట్నం మైనర్‌ పోర్టును డి-నోటిఫై చేయాలని ఏపీకి చెప్పామని కేంద్రం వెల్లడించింది. రామాయపట్నం వద్దంటే మేజర్‌పోర్టుకు మరో ప్రదేశం గుర్తించాలని కేంద్రం సూచించింది. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని   నిపుణుల బృందం అధ్యయనంలో తేలిందన్నారు.  స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఉక్కుశాఖ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిందని... నివేదిక అనుకూలంగా రాలేదన్నారు. విభజన సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవచ్చని, తాము మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తామని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. 


విభజన సాయం కింద ఏపీకి రూ. 21,154 కోట్లు 


వర్సిటీలు, పోలవరం, రాజధానికి రూ. 21,154 కోట్లు ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. ఐఐటీకి రూ.1,022 కోట్లు, ఐసర్‌కు రూ.1,184 కోట్లు విడుదల చేశామని నివేదికలో పేర్కొంది. ఎయిమ్స్‌కు రూ.1,319 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.24కోట్లు, వ్యవసాయ వర్సిటీకి రూ.135 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, పోలవరానికి రూ.14,969 కోట్లు విడుదల చేశామని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు పరిష్కారం కోసం సమయానుకూలంగా హోం శాఖ సమీక్షిస్తుందని... కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులతో 31 సమావేశాలు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.   ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపరిచిన అనేక అంశాలు అమలు చేశారని, మరికొన్ని ప్రాజక్టులు వివిధ దశల్లో ఉంది’ అని కేంద్ర హోం శాఖ పార్లమెంట్‌కు నివేదించింది.                                    


కేంద్రం సమాధానంతో ఏపీకి పెద్దగా ప్రయోజనం లేదనే అభిప్రాయం


కేంద్రం సమాధానంతో ఏపీకి కొత్తగా ఇచ్చినవి.. ఇవ్వాల్సిన ఏవీ లేవని చెప్పినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలు ఉన్నాయి.  వాటిని రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని చెప్పడం ద్వారా.. ఆ సమస్యల విషయంలో చేతులెత్తేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.