Andhra Liquor bonds  :     ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ బాండ్లను వేలం రూ. 8 వేల కోట్ల రుణాలను సమీకరించుకుంది. ఏపీ ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ( NCD ) ఆఫర్ చేసి రూ. రెండు వేల కోట్లను సమీకరించాలనుకుంది. అయితే అనూహ్యంగా ఈ ఎన్‌సీడీల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపారు. ఐదు రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. అయితే ... తాము రూ. ఎనిమిది వేల కోట్లు మాత్రమే తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


9.5  శాతం వడ్డీతో  లిక్కర్ బాండ్లు వేలం వేసి అప్పు తెచ్చుకున్న జగన్ సర్కార్ 


గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  అమరావతి బాండ్లను వేలం వేసి రూ. రెండు వేల కోట్ల రుణాలను సమీకరించారు. ఇప్పుడు లిక్కర్ బాండ్లను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని ఎలాంటి ప్రచారం లేకుండా ప్రభుత్వం పూర్తి చేసింది. రూ. ఎనిమిది వేల కోట్లకు  9.5 శాతం వరకూ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. రేటింగ్ సంస్థలు స్టేబుల్ కేటగిరి కింద రేటింగ్ ఇవ్వడంతో రుణ సమీకరణ సులువు అయింది. 


మూడు నెలలకోసారి వడ్డీ కడతామని హామీ 


ఏపీ లిక్కర్ బాండ్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపించడానికి కారణం ప్రభుత్వం చూపించిన ఆదాయం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో లిక్కర్ ఆదాయం రూ. 18 వేల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం లిక్కర్ బాండ్ల జారీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. గత ఏడాది కన్నా రెట్టింపు అయిందని తెలిపింది. అదే సమయంలో ప్రతి మూడు నెలలకు ఓ సారి వడ్డీ చెల్లిస్తామని ఇందు కోసం ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ తెలిచి.. లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చే నగదును అందులో జమ చేస్తామని తెలిపింది. ఇది లిక్కర్ బాండ్లు కొనుగోలుచేయాలనకున్న వారికి ఆకర్షణీయంగా అనిపించినట్లుగా తెలుస్తోంది. 


మద్య నిషేధం చేయబోమని రుణాలిచ్చిన వారికి హామీ పత్రం


ఎట్టి పరిస్థితుల్లోనూ మద్య నిషేధం అనే మాటే ఉండదని ప్రభుత్వం హామీ ఇవ్వడం సంచలనాత్మకంగా మారింది. పాక్షికంగా కూడా మద్య నిషేధం చేయమని.. అలా చేస్తే.. లిక్కర్ బాండ్లు మూడు నెలల్లో లిక్విడేట్ అయినట్లుగా భావించి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే నిబంధన పెట్టారు. నిజానికి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు మద్య నిషేధ హామీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల సమయానికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే లిక్కర్ అమ్ముతామని.. అప్పుడే ఓట్లు అడుగుతామని చెప్పారు. కానీ ఇప్పుడు అసలు మద్య నిషేధం చేయబోమని హమీ ఇచ్చి అప్పులు తెచ్చుకోవడం ఆసక్తికరంగా మారింది.