Gannavaram News : గన్నవరం నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు రోజు రోజుకూ ముదురుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనకే వస్తుందని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు దీమా వ్యక్తం చేశారు. యార్లగడ్డ కామెంట్స్ పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. తనకు సీఎం జగన్ మద్దతు ఉందని వంశీ అన్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చిపోయే వారి గురించి తాను పట్టించుకోనన్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో సీఎం జగన్‌ నిర్ణయిస్తారన్నారు. గన్నవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన... మట్టి తవ్వకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. 


నా సినిమాల్లో క్యారెక్టర్లే వాళ్లు


సీఎం జగన్‌ పని చేయమన్నారు, ఆయన ఆదేశాలతో పని చేస్తున్నానని ఎమ్మెల్యే వంశీ అన్నారు. మిగతా వారి గురించి పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. తన మీద ఏమైనా చెప్పలనుకుంటే సీఎం జగన్‌ దగ్గర చెప్పుకుంటారన్నారు. అప్పుడప్పుడు వచ్చి పిచ్చి కామెంట్లు చేయడం అన్నీ అనవసం అన్నారు. తాను గెలిచినా ఓడిపోడినా గన్నవరంలోనే ఉన్నానన్నారు. తాను తీసిన సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయన్నారు. ఊరు, దేశం వదిలిపోయే వాళ్లు, అప్పుడప్పుడు వచ్చి పారిపోయేవాళ్లను చాలా మందిని చూశానన్నారు. 


యార్లగడ్డ వెంకట్రావు ఏమన్నారంటే? 


అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీ తనకే టికెట్ ఇస్తుందని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేసి ఇటీవలి కాలంలో ఎక్కువగా అమెరికాలో ఉంటున్న యార్లగడ్డ వెంకట్రావు మళ్లీ గన్నవరం వచ్చారు. టీడీపీ నుంచి వైసీపీకి షిఫ్ట్ అయిన ఎమ్మెల్యే వంశీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విలన్ తో పోటీ చేశానన్న ఆయన... అతన్ని పార్టీలోకి  తీసుకునే సమయంలోనూ వ్యతిరేకించానన్నారు. ప్రతిసారి అధిష్ఠానంతో పోరాటం చేయలేనని యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై హాట్ కామెంట్స్ చేశారు. తాను నిత్యం కార్యకర్తలతో అందుబాటులో ఉన్నానన్నారు. వ్యక్తిగత పని మీద 6 నెలలు అమెరికా వెళ్లానని ఆ సమయంలో ఎంతోమంది తనపై దుష్ప్రచారం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసేది అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని ఊహగానాలు అనవసరమని కొట్టిపడేశారు. సీఎం జగన్ తనకు కేడీసీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని, 11 నెలలు పాటు కష్టపడి పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి 43 శాతం వృద్ధి సాధించే విధంగా కృషి చేశానని గుర్తుచేశారు. 


 గన్నవరం  నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావుతో పాటు దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి కూడా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారిద్దరూ వంశీకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వవొద్దని అంటున్నారు.