Andhra News : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి‎పై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు,సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ విమర్శించారు. అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన  ఆర్థిక అంశాలపై మాట్లాడాలి అంటే అనుభవం ఉండాలని..అలాగే ఏదైనా ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రత్యేక కోర్సు అయినా చేసి ఉండాలని ఇటువంటి సున్నితమైన అంశాలపై అపోహలు సృష్టించడం ఏమిటని విపక్షాలను  ప్రశ్నించారు.


ప్రభుత్వ అప్పుపై ప్రజలకు అందుబాటులో పూర్తి సమాచారం 


ప్రభుత్వ అప్పు ఎంత అనేది   ప్రభుత్వ వెబ్ సైట్ లల్లో అందుబాటులో ఉందని దువ్వూరి కృష్ణ తెలిపారు.  రాష్ట్ర విభజన జరిగే సమయానికి రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం రూ.1,96,202 కోట్లుగా ఉందని..ఈ నాలుగేళ్ల లో రూ. 4,42,442 కోట్ల రుణాలు ఉన్నట్టు అర్బీఐ చెప్పిందని తెలిపారు. ఇక ప్రభుత్వ హామీ ఇచ్చే రుణాలు తీసుకున్న కార్పొరేషన్లు తీసుకున్న అప్పు రూ. 1,44,875 కోట్లు రుణం ఉందని..అందులో విద్యుత్ సంస్థల రుణమే 45 వేల కోట్లు ఉందన్నారు. 


ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తప్పుడు ప్రచారం                   


రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా తీసుకున్న రుణం రూ.56,017 కోట్లు ఇక విద్యుత్ సంస్థలకు ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంలు తీసుకున్న అప్పు 64,472 కోట్లుగా ఉందన్నారు. గ్యారెంటీ లేకుండా అప్పులు తీసుకుని తీర్చే శక్తి పవర్ సెక్టార్ కు మాత్రమే ఉందని.. రెవెన్యూ ఎక్సెపెండేచర్ ఎప్పుడూ వృధా కాదన్నారు. గత తెలుగుదేశం పాలనలో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్  యావరేజ్ రూ.15,227 కోట్లు వుందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో 2019-20 నుండి 2022–23 ఇప్పటి వరకు క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ.75,411.19 కోట్ల రూపాయలు అనీ..యావరేజ్ 18,852.80 కోట్ల రూపాయలు వుందని..తేడా గమనిస్తే గత ప్రభుత్వ పాలన కంటే ఈ ప్రభుత్వ పాలనలో క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ తగ్గలేదని స్పష్టం చేశారు.


గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు                                          


గత ప్రభుత్వ హయాంలో పెరిగినట్లు, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు పెరగలేదని  దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు.  అసలు అప్పు కూడా టీడీపీ హయాంలో 2.60 లక్షల కోట్లు పెరిగితే, ఇప్పుడు మాత్రం రూ2.35 లక్షల కోట్లే పెరిగిందన్నారు.  మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని ఎలా చెబుతారు" అని ప్రశ్నించారు.  జీతాలు, పెన్షన్లు, బిల్లుల చెల్లింపుల కోసం అప్పులు చేస్తున్నారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని స్పష్టంచేశారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో 21.87 శాతం CAGR చొప్పున పెరిగిన అప్పులు, ఇప్పుడు 12.69 శాతం CAGR  చొప్పున మాత్రమే పెరిగాయి. దీనిని అప్పుల ఊబిలో కూరుకుపోవడం అంటారా? అని ప్రశ్నించారు.