Fact Check :    వెనుకబడిన తరగతులకు చెందిన బోయవాల్మీకి, బెంతోరియా కులాలను గిరిజనుల జాబితాలో చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  బోయవాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని  మన్యం ప్రాంతలంలో గిరిజనులు ఆందోళన చేస్తున్నారు.  బంద్ కూడా నిర్వహించారు.   అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం ద్వారా సీఎం జగన్‌ గిరిజన ద్రోహిగా మిగిలిపోయారని ఇతర పార్టీలు, సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా  కొవ్వొత్తులతో వేర్వేరుగా నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ప్రభుత్వ తీర్మానంతో నిజమైన ఆదివాసీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు దూరమవుతాయని, వారి మనుగడ దెబ్బతింటుందని గిరిజనులు అంటున్నారు.   





 
 అయితే ఈ అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్  వివరణాత్మకంగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.  70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్న బోయ, వాల్మీకి కులాలకు న్యాయం చేసేందుకు వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. దీనివల్ల ఎస్టీలకు అన్యాయం జరుగుతుందనే దుష్ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని కోరింది. మన రాష్ట్రంలో సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, జోనల్‌ వ్యవస్థ ఉన్నాయి. దీంతో చదువులు, ఉద్యోగాల విషయంలో ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ వేరే జోన్‌లోకి వస్తాయి. బోయ, వాల్మీకిలు ఎక్కువగా ఉన్న రాయలసీమ వేరే జోన్‌లో ఉందని తెలిపింది. 


బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చడం వల్ల ఏజెన్సీల్లోని ఎస్టీల చదువులు, ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. వారి ఉద్యోగాలు వారికే ఉంటాయి. నాన్‌ జోనింగ్‌ ఉద్యోగాలపైనే చాలా స్వల్ప ప్రభావం ఉంటుంది. కేవలం గ్రూప్‌ 1 ఉద్యోగాలు మాత్రమే ఈ నాన్‌ జోనింగ్‌ పరిధిలోకి వస్తాయి. గత పదేళ్లలో రాష్ట్రంలో 386 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటిలో 6 శాతం ఎస్టీ రిజర్వేషన్‌ అంటే కేవలం 22 ఉద్యోగాలమీదే పోటీ ఉంటుంది. మిగిలినవన్నీ జిల్లాల ఉద్యోగాలు. అవన్నీ జోన్‌లకు సంబంధించినవే. మొత్తం ఉద్యోగాల్లో ఇవే 99 శాతం వరకూ ఉంటాయని తెలిపింది. 


కాబట్టి బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీలకు ముఖ్యంగా యువత, ఉద్యోగులకు ఎలాంటి అన్యాయమూ జరగదు. గిరిజనులు, ఆదివాసీల హక్కులూ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదు. ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీలకు అన్యాయం జరుగుతుందనడం అవాస్తవమని ప్రకటించారు. అయితే ఆగ్రహించిన ఎస్టీలను సంతజృప్తి పరచడానికి ఆ రిజర్వేషన్ల వల్ల వాల్మికీ బోయలకు కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పడం ఏమిటన్న విస్మయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది.