AP Bar Policy :   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ ప్రకటించింది. ఈ పాలసీ సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానుది.  అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్‌లను పొడిగిస్తారు. కొత్త  బార్ పాలసీ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అంటే కొత్తగా లైసెన్స్‌లు తీసుకునేవారు మూడేళ్ల పాటు బార్‌లు నడుపుకోవచ్చు. వేలం పద్దతిలో బార్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందు మద్యం దుకాణాలకు వేలం పద్దతి నిర్వహించేవారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది.  ఇప్పుడు బార్లకు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు పెట్టి .. వేలం నిర్వహించాలని నిర్ణయించుకుంది. మొత్తం బార్లను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. రాష్ట్రం మొత్తం మీద 840 బార్లకు అనుమతి ఇస్తారు. 


అప్లికేషన్ ఫీజే రూ. 10 లక్షలు !


బార్‌కు అప్లయ్ చేసుకోవాలంటే లక్షలు కట్టాల్సిందే. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలనుకుంటే ముందుగా రూ. ఐదు లక్షలు పెట్టి అప్లికేషన్ కొనుక్కోవాలి. బార్ కేటాయింపు జరిగినా జరగకపోయినా ఈ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వరు. అలాగే 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలంటే అప్లికేషన్ ఖరీదు రూ. ఏడున్నర లక్షలు, 5 లక్షలు అంత కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలంటే రూ. పది లక్షల అప్లికేషన్ పీజు కట్టాల్సి ఉంటుంది. తర్వాత బార్ల కోసం వేలం పాట నిర్వహిస్తారు. 


త్రీ స్టార్ అయితే ఖచ్చితంగా రూ. 50 లక్షలు కట్టాల్సిందే..!


త్రీ స్టార్ హోటల్స్‌కు విడిగా ధరలు నిర్ణయించారు. రూ. ఐదు లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు బార్లు పెట్టాలనుకునే అన్ని త్రీ స్టార్ హోటల్స్ కట్టాలి. ఆ పైన జనాభాను బట్టి రూ. 15 నుంచి 50 లక్షలు ఏడాదికోసారి చెల్లించాలి. అలాగే ప్రతీ ఏడాది పది శాతం చొప్పున పెంచుకూ వెళ్తారు. మద్యపానాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్నందున ఆ ప్రకారమే ఇలాంటి విధి విధానాలను ఖరారు చేశామని ప్రభుత్వం తెలిపింది. 


ఏపీలో మద్య నిషేధం హామీ అమలు చేయనట్లే ! 


వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టో ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌లో మాత్రమే మద్యం అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని ఆ పార్టీ నేతలు పలుమార్లు చెప్పారు. అయితే ఇటీవల మద్యం బాండ్లపై రూ. ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చుకున్నప్పుడు పాక్షికంగా కూడా మద్య నిషేధం చేయబోమని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు బార్లకు కూడా మూడేళ్ల బార్ పాలసీని ప్రకటించడంతో  సీఎం జగన్ మద్య నిషేధ హామీ విషయంలో వెనక్కి తగ్గినట్లుగానే భావిస్తున్నారు.