కృష్ణా జిల్లా నాగాయలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం ఉదయం ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆయనను బందరులో అదుపులోకి తీసుకొని నాగాయలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. రవీంద్రను కలిసేందుకు పార్టీ నేత మండలి బుద్ధ ప్రసాద్ తనయుడు వెంకట్రాం పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు.


దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారు. సైకిల్ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు


దీంతో కొల్లు రవీంద్ర కు నోటీసులు ఇచ్చి తిరిగి బందరు తీసుకెళ్లి వదిలేస్తామని పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల మీద నమ్మకం లేదని టీడీపీ పార్టీ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఎవరైనా ఒకరు తమతో రావచ్చని తెలిపారు. దీంతో రవీంద్ర తోపాటు వెంకట్రం ను నాగాయలంక పోలీస్ స్టేషన్ నుంచి రెండు వాహనాల్లో తరలించారు. కాగా బందరు సమీపంలోకి వెళ్ళగానే పోలీసులు మరో వాహనంలోకి వెంకట్రం తరలించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.


ప్రస్తుతం ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయితే కొల్లు రవీంద్రను పోలీసులు బందరు తీసుకెళ్లకుండా ఎక్కడికి తరలించారనే విషయం మాత్రం తెలియ రాలేదు. దీంతో కొల్లు రవీంద్ర అదృశ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు జిల్లా కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. 


రవీంద్ర ఆచూకీ కోసం లోకేష్ ఆరా


మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆచూకీ పై టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరా తీశారు. పోలీసు అధికారులతో మాట్లాడాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సైకిల్ యాత్ర చేస్తున్న మాజీ మంత్రిని ఇంత వేదిస్తారా? తప్పుడు కేసులు అక్రమ నిర్బంధాల తప్ప పాలన కనిపించడం లేదని లోకేష్ మండిపడ్డారు. వెంటనే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. 


రాష్ట్రంలో టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని లోకేష్ చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ తీరును కూడా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలని లోకేష్ తెలిపారు.


 స్వచ్ఛందంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ నాయకుల పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. శాంతియుతంగా ర్యాలీలు నిరసనలు చేపడుతున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ కేసులో చంద్రబాబును ఇరికించి రాక్షసానందం పొందుతూ వ్యవస్థలన్నింటినీ జగన్‌ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నాడని విమర్శించారు. జైలులో చంద్రబాబును మానసిక వ్యధకు గురయ్యేలా జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ కుట్రలను, రాక్షస పాలనపై ప్రజలందరూ తిరగబడాలని కోరారు.