MLC Kancharla Srikanth: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. పలు సంచలన ఆరోపణలు చేశారు. పుంగనూరులో ఇంటి నెంబర్లు లేకుండా రెండు వేల ఓట్లు నమోదయ్యాయయన్నారు.  ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.  ఓటర్ల వెరిఫికేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా బయట పడ్డాయని ఆరోపించారు. అందులో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎన్నికల సంఘం నిజా నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. 


‘ఏం సమాధానం చెబుతావు.. పెద్దిరెడ్డి’
కుప్పంలో 25 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారని అందులో వాస్తవం లేదని కంచర్ల అన్నారు. ఏవైనా దొంగ ఓట్లను గుర్తిస్తే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పుంగనూరు టౌ‌న్‌లో రెండు వేలకు పైగా ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా ఉన్నాయని, వీటికి పెద్దిరెడ్డి ఏం చెబుతారని ప్రశ్నించారు. కుప్పంలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. టీడీపీ తరుఫున తామే 12 వేలకు పైగా చనిపోయినవారు, బయట స్థిరపడ్డ వారి వివరాలు ఇచ్చామని తెలిపారు. ఈ సారి పుంగనూరులోనే మంత్రి పెద్దిరెడ్డిని ఓడించి టీడీపీ సత్తా ఏంటో చాటి చెబుతామన్నారు.


దొంగ ఓట్లతో అధికారులు సస్పెండ్ అయ్యారు
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో జరిగిన దొంగ ఓట్ల బాగోతంలో అధికారులు సస్పెండ్ అయ్యారని కంచర్ల శ్రీకాంటత్ అన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు అన్యాయంగా, అక్రమంగా తీసేస్తే చట్ట పరంగా, న్యాయ పరంగా కేసులు వేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను ఉపయోగించకూడదని చెప్పినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సార్లు వలంటీర్ పేరుతో వైసీపీ కార్యకర్తలు ఓటర్ వెరిఫికేషన్‌కు వెళ్తున్నారని ఆరోపించారు. బీఎల్‌ఓలతో కలిసి వాలంటీర్లు ఓటర్ల వెరిఫికేషన్‌కు వెళ్తే కేసులు వేస్తామని హెచ్చరించారు. అలాగే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.


కుప్పంలో ఎగిరేది టీడీపీ జెండానే..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు కుప్పంలోనూ గెలిచేదే టీడీపీనే కంచర్ల అన్నారు. కుప్పంలో గెలిచేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని, పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు యత్నిస్తోందని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 10 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, కుప్పంలో తిరుగుతున్న పెద్దిరెడ్డి దీనికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లోకేష్ చేపడుతున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారం చేపడుతుందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అభివృద్ధిని అటకెక్కించారని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు తెచ్చారని ఎద్దేవా చేశారు.


కుప్పంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సీటుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పట్టుకోసం పోరాడుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఉనికి చాటుకున్న వైసీపీ ఈ సారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే కసితో ఉంది. అలాగే కుప్పంలో మరో సారి జెండా ఎగరేసి తమ పట్టు నిలుపుకోవాలని గట్టిగా పోరాడుతోంది.