IPS Transfers :  ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పది మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ అధికారి సత్య ఏసుబాబును డీజీపీ అఫీస్‌కు అటాచ్ చేశారు. ఆయనకు పోస్టింగ్ దక్కలేదు.  గ్రౌహౌండ్స్ గ్రూపు కమాండర్‌గా సునీల్  షరాన్, అనంతపురం ఎస్పీగా జగదీశ్ ను నియమించారు. ఇప్పటి వరకూ సత్యఏసుబాబు ఇక్కడ ఎస్పీగా ఉన్నారు. ఆయనను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయమన్నారు. 16వ బెటాలియన్ కమాండెంట్ గా మురళీకృష్ణ, గుంతకల్లు రైల్వే ఎస్ఆర్‌పీగా రాహుల్ మీనా, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజ్, ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చితూరు ఎఎస్పీగా పంకజ్ కుమార్ మీనాకు అవకాశం కల్పించారు. 


ఇప్పటికే వెయిటింగ్‌లో పదహారు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు  


ఇప్పటికే ఏపీలో పదహారు మందికిపైగా సీనియర్ ఐపీఎస్ అధికారులు వెయిటింగ్‌లో ఉన్నారు. వారికి ఇప్పుడు మరో ఐపీఎస్ తోడయ్యారు. సత్య ఏసుబాబును గత  బదిలీల్లో పట్టించుకోలేదు. ఆయనపై అనంతపురం టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఆయనను తప్పించి.. డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. అంటే వెయిటింగ్‌లో పెట్టినట్లే. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఆఫీసర్లు అంతా వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసి.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ అందర్నీ కేసుల్లో ఇరికించారని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగితే ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టడం దగ్గర నుంచి  సీఐడీ కేసుల పేరుతో చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టడం వరకూ అనేక  పనులు చేసిన అధికారులు అంతా ఇప్పుడు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. 


వైసీపీ  హయాంలో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు              


వీరికి పోస్టింగులు లేకపోయినప్పటికీ ఇటీవల కొంత మంది తాము చేసిన పనులపై జరుగుతున్న విచారణల్లో జోక్యం చేసుకుంటున్నారని.. తమ తప్పు ఏమీ లేదని నివేదికలు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని అంతర్గత నివేదికలు అందడంతో వారందరికీ డీజీపీ తిరుమలరావు ఓ మెమో జారీ చేశారు. వారు వెయిటింగ్ లో .. పోస్టింగ్ లేకపోతే దాని అర్థం ఇంట్లో రిలాక్స్ అవమని కాదని.. ఖచ్చితంగా అందరూ డీజీపీ ఆఫీసులో అటెండెన్స్ నమోదు చేసుకోవాలని ఆదేశాలు  జారీ చేశారు. ఈ మేరకు వారి పేర్లతో మెమో కూడా జారీ చేశారు. అత్యవసర పనులు అవసరం అయితే వారిని పురమాయిస్తామని డీజీపీ చెప్పారు. 


ఆధారాలతో సహా దొరికిన కొంత మందిపై కేసులు నమోదు చేసే అవకాశం           


మరో వైపు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు తమ డ్యూటీలో ఉన్నప్పుడు పెట్టిన తప్పుడు కేసుల లెక్కలన్నీ బయటకు తీస్తున్నారని.. వీరిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన కొంత మందిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.