ITDP : తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్ ను వివరిస్తూ ఓ యాంకర్ వార్తలను చదివిన వీడియో విడుదలయింది. న్యూస్ యాంకర్ మొత్తం షెడ్యూల్ గురించి స్పష్టమైన తెలుగులో వివరించింది. దీంతో ఎవరీ యాంకర్ అని చర్చించుకున్నారు. ఆమె పేరు వైభవి అని ముందే పరిచయం చేసుకున్నారు. కానీ కాసేపటికి తెలిసిన విషయం ఏమిటంటే.. ఆమె అసలు యాంకర్ కాదు. సాంకేతికతతో సృష్టించిన కృత్రిమ యాంకర్. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో యువగళంలో కొత్త ప్రయోగాన్ని టీడీపీ చేపట్టింది. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్‌తో వార్తలు చదివేలా డిజైన్ చేశారు. టీడీపీ అనుబంధ విభాగం ఐ టీడీపీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు. కనిగిరిలో నారా లోకేష్ యువగళం పాదయాత్రపై షెడ్యూల్ వివరిస్తూ కృత్రిమ యాంకర్ వైభవి వార్తలు చదివారు. యువగళం అప్డేట్స్ ఇచ్చేలా కృత్రిమ యాంకర్‌తో వార్తల వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు, అప్డేట్స్ ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయపార్టీల చరిత్రలో తొలి ఎఐ యాంకర్ కాన్సెప్ట్ టీడీపీనే ఉపయోగించింది.
సాంకేతికత వినియోగంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇప్పటి వరకూ ఏఐ ద్వారా కృత్రిమ యాంకర్ ను సషృష్టించే ప్రయత్నాన్ని న్యూస్ చానల్స్ చేస్తున్నాయి. ఒడిషాలో ఓ టీవీ, తెలుగులో మరో టీవీ చానల్ కృత్రిమ మేధ ద్వారా యాంకర్లతో వార్తలను చదివించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే న్యూస్ చానల్స్ తప్ప ఇతరులకు అవసరం ఉండదని అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ .. అది తప్పని నిరూపించింది. తమ పార్టీకి సంబంధించిన వార్తలను ఐ టీడీపీ చానల్ ద్వారా ఇలా ఏఐ యాంకర్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
మామూలుగా యాంకర్ ను పెట్టుకుని చదివించుకోవాలంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది. కానీ వైభవి ద్వారా తాము చెప్పాలనుకున్న అంశాన్ని ప్రజల్లోకి పంపాలనుకుం టే.. అదిఒక్క క్లిక్ తో సరిపోతుంది. అందుకే ఐ టీడీపీ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. భవిష్యత్‌లో ఈ ప్రయోగం వల్ల ఎంత మందికి ఉపయోగమో కానీ.. మొత్తంగా యాంకర్ వైభవి మాత్రం వైరల్ అయింది.