Breaking News Live: కరీంనగర్ లో ఇంటి మీదకు దూసుకెళ్లిన గ్రానైట్ లారీ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 01 Apr 2022 08:49 PM
కరీంనగర్ లో తప్పిన ప్రమాదం, ఇంటి మీదకు దూసుకెళ్లిన గ్రానైట్ లారీ 

కరీంనగర్ లోని శివ నగర్ ఏరియా రాంనగర్ బైపాస్ రోడ్డుపై గ్రానైట్ లారీ డివైడర్ ఢీ కొట్టి ఇంటి మీదకు దుసుకెళ్లింది. దీంతో నడిరోడ్డుపై భారీ సైజ్ గ్రానైట్ రాయి పడింది. జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి మృతి, పొంతనలేని కారణాలు చెబుతున్న వైద్యులు 

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని అంకుర్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16 రోజుల పసికందు మృతి చెందాడు. ఊపిరితిత్తుల సమస్య ఉందని ఆసుపత్రి వైద్యులు గురువారం సాయంత్రం సర్జరీ చేశారు. తరువాత ముక్కులో నుంచి రక్తం వచ్చి చిన్నారి మరణించాడు. మరణానికి కారణం అడిగితే ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. 

హనుమకొండ చైతన్య డిగ్రీ కళాశాల భవనం పై నుంచి పడి విద్యార్థి మృతి 

హనుమకొండ చైతన్య డిగ్రీ కళాశాలలో విషాదం నెలకొంది.  భవనంపై నుంచి పడి ఫార్మా విద్యార్థి మృతి చెందారు. యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించింది.  మృతుడిది అస్సాం రాష్ట్రంగా తెలుస్తోంది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Balkampet Ellamma Temple: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జులై 5న

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జులై 5న నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మాసాబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గురువారం బల్కంపేట అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారంలో రెండున్నర కిలోల బంగారంతో బోనం తయారు చేయించనున్నట్లు చెప్పారు. 

శ్రీ విమాన వేంక‌టేశ్వ‌ర‌ స్వామి వారికి వెండి తోర‌ణం బ‌హుక‌ర‌ణ‌

తిరుమల శ్రీవారి ఆల‌యం బంగారు గోపురంపై ఉన్న విమాన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు ఉదయం హైద‌రాబాద్‌కు చెందిన‌ అగర్వాల్ 5 కేజీల స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన తోరణాన్ని విరాళంగా అందించారు.. ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి దాదాపు 5 లక్షల విలువ గ‌ల వెండి తోర‌ణాన్ని దాత అందించారు.

Dalitha Babdhu: ఈ ఏడాదిలో 2 లక్షల మందికి దళిత బంధు - హరీశ్ రావు

దళిత బంధును రాబోయే రోజుల్లో ఇతర వర్గాలకు విస్తరిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం పటాన్‌చెరులో దళితబంధు పథకం లబ్ధిదారులకు మంత్రి యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...దళితబంధు ఓ సామాజిక ఉద్యమమన్నారు. ఈ బడ్జెట్‌లో రూ.17800 కోట్లు దళితబంధు కోసం కేటాయించామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో 2 లక్షల మందికి దళిత బంధు అందిస్తామని చెప్పారు.

Telangana Congress: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వీహెచ్‌కు పిలుపు

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశానికి వీహెచ్‌కు ఆహ్వానం అందలేదు. దీనిపై వీహెచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా రాష్ర్ట ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అవమానించారని వీహెచ్ కోపంగా ఉన్నారు. దీనిపై ఏఐసీసీకి వి.హనుమంతరావు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఏఐసీసీ కార్యాలయం ఢిల్లీ వచ్చి కలవాల్సిందిగా వీహెచ్‌కు సమాధానం ఇచ్చింది. దీంతో ఈ రోజు సాయంత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వీహెచ్ ప్రత్యేకంగా కలవనున్నారు. 

కాసేపట్లో వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ప్రారంభం

వైఎస్సార్‌ ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ అత్యాధునిక 500 ఏసీ వాహనాలను ఇవాళ ఉదయం 10.30కు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ప్రసవం అనంతరం తిరిగి వారిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను వాడతారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా విశ్రాంతి సమయంలో తల్లి అవసరాల కోసం రూ.5 వేలను సాయంగా అందించనున్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 102ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాల వారీగా విశాఖపట్నం- 67, శ్రీకాకుళానికి- 23, విజయనగరం- 33, కృష్ణా- 33, గుంటూరు- 31, తూర్పు గోదావరి- 62, పశ్చిమ గోదావరి- 33, కర్నూలు- 64, అనంతపురానికి- 36, చిత్తూరు- 52, ప్రకాశం- 24, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు- 19, కడప- 23 చొప్పున ఈ వాహనాలు కేటాయించారు.

ఏపీ వోల్వో బస్సు - తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఐచర్, మరో తెలంగాణ ఆర్టీసీ ఓల్వో బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న మూడు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని మిడుతూరు గ్రామస్తులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో కర్నూలుకు తరలించారు. 44వ జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. భారీ క్రేన్ సహాయంతో రెండు లారీలను, ఓల్వో బస్సును రోడ్డు పక్కకు జరిపేందుకు పోలీసులు శ్రమిస్తారు.

Background

ఏపీ, తెలంగాణలో ఎండలు మరింత పెరగనున్నట్లుగా అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా వాతావరణం పొడిగానే ఉంటుంది. మరోవైపు, మత్స్యకారులకు వచ్చే నాలుగు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవని అవరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 


మరోవైపు, ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఎండలు కాస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ సాధారణం కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం చెబుతోంది. రాయలసీమ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తుంది. విజయవాడ, విశాఖలోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.


కోస్తాంధ్ర ప్రాంతంలో కాస్త ఉష్ణోగ్రత తగ్గుదల: ఏపీ వెదర్ మ్యాన్
‘‘బలమైన సముద్రపు గాలుల వల్ల కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టింది. మరో వైపున రాయలసీమ జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి కూడ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ఇవి ఇలాగే మరో రెండు గంటల దాక కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్కన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో కూడ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యింది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణ రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఎండలు కాస్తున్న 6 జిల్లాలను వాతావరణ కేంద్రం గుర్తించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జ‌గిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల‌ల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది. ఈ మేరకు వాతావ‌ర‌ణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ ఆరు జిల్లాలతో పాటు భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయని హెచ్చరించింది.


గడిచిన 24 గంటల్లో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కాగా, అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే నమోదైంది. అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలుగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ 4 వరకూ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని, ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.