Big Breaking: మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులకు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ వెంకట అప్పల నాయుడులు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొననున్నారు.
మేడ్చల్‌లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్‌పై నుంచి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను, ఆటోను ఢీ కొట్టింది. అంతేకాక, బైక్‌ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఓ లారీ కిందకు దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులను గుర్తించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,302 కు చేరింది. 322 మంది శుక్రవారం నాడు కోలుకున్నారు. ఒకరు కరోనా వల్ల చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3,893 కు చేరింది. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారు 5,324 మంది ఉన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. 2016 నుంచి విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా ఉన్నారు.
హైదరాబాద్ హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుధీర్ కుమార్ కాలనిలో విషాద ఘటన చోటుచేసుకుంది. 2 సంవత్సరాల చిన్నారి నిత్య నీళ్ల సంపులో పడి మృతిచెందింది. సంపులో పడిన గంట తరువాత పాపని గుర్తించారు. సంతోషి, రాజు దంపతులకు నిత్య మూడో సంతానం.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మొదటి మలుపు వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో తెలంగాణకు చెందిన భక్తుడు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
వినాయకుడి దయ వల్ల హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అపోలో ఆస్పత్రిలో సాయి తేజ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. సాయి తేజ్‌కి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు. హెల్మెట్, షూస్, జాకెట్ ధరించడవం వల్ల ప్రమాదం తప్పిందన్నారు. సాయి తేజ్‌కు స్వల్ప ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు తెలిపారని వెల్లడించారు. ఈ ఘటనపై మీడియా సంయమనం పాటించాలని మంత్రి తలసాని కోరారు. కుటుంబసభ్యులు, అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. సాయి తేజ్ ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు.
సాయి ధరమ్ తేజ్, తన కుమారుడికి బైక్ రైడింగ్ వద్దని చాలా సార్లు చెప్పానని మా అధ్యక్షుడు నరేష్ అన్నారు. కౌన్సెలింగ్ కు తీసుకెళ్దామనుకున్నానని అన్నారు. ప్రమాదానికి ముందు తన ఇంటి నుంచే సాయి ధరమ్ తేజ్ బయలు దేరారని తెలిపారు.
కడప జిల్లాలో ఆగంతకులు రెచ్చిపోయారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి పట్టణం కె.రామాపురంలోని డైట్ వసతి గృహ ఆవరణలో మహేశ్వరి (55)అనే మహిళ మార్నింగ్ వాక్ చేస్తుండగా ఓ ఆగంతకుడు రాయితో తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయిన మహిళ మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసును లాక్కునే యత్నం చేశాడు. ఆమె నిలువరించడంతో మరోసారి రాయితో తలపై కొట్టి గొలుసు లాక్కెళ్లాడు. గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరో ఘటన కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎన్జీవో కాలనీలో ఓ మహిళపై దుండగుడు కోడి కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరించాడు. ఈ రెండు ఘటనలూ ఒకే వ్యక్తి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదే సమయంలో రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీ, రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఇలాంటి చర్యల వల్ల నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారన్నారు.
హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. అవయవాల పనితీరు సాధారంగా ఉందని పేర్కొన్నారు. శరీర అంతర్భాగాల్లో గాయాలు లేవని పేర్కొన్నారు. సాయిధరమ్ తేజ్ కి సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ అలోక్ రంజన్ చికిత్స అందిస్తున్నారు.
హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఐకియా వైపు వెళ్తుండగా ఆయన బైక్‌పై నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయి తేజ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సాయిధరమ్ తేజ్‌కు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని త్వరలోనే సాయి ఆరోగ్యంతో తిరిగి వచ్చేస్తాడని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై మాదాపూర్ ఏసీపీ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకున్నారని, మద్యం సేవించలేదని తెలిపారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందన్నారు. దాని వల్ల తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారని ఏసీపీ చెప్పారు.
హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బైక్‌పై వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయారని పేర్కొన్నారు. రాయదుర్గం పోలీసులు సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద, ఐపీసీ సెక్షన్లు 3, 36, 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది.
Background
తెలంగాణ ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు ఇవాళ శ్రీకారం చుట్టునున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్‌నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సమన్వయంతో ఐటీశాఖ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు లేని ప్రాంతాల్లోని ప్రజలకు ఔషధాలు సరఫరా చేయనున్నారు. వికారాబాద్‌లో ఈ ప్రాజెక్టును నిర్వహించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. మారుట్ డ్రోన్స్, బ్లూ డార్ట్, స్కై ఎయిర్, టెక్ ఈగిల్ సంస్థలు రెండ్రోజులుగా అవసరమైన ఏర్పాట్లు, ట్రయల్ రన్స్ చేశాయి. మొదటి రోజు ట్రయల్ రన్లో 400 మీటర్ల ఎత్తు వరకు ఔషధాల బాక్సును డ్రోన్లు తీసుకెళ్లాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -