Breaking News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 9న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 09 Sep 2021 07:38 PM
ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్

ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పన్ను చెల్లింపుదారులకు కీలక ప్రకటన చేసింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు గడువును పొడిగించింది. ఐటీఆర్‌ దాఖలు చేయడానికి డిసెంబర్‌ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది.

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైద‌రాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దాదాపు 10 రోజులుగా ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఆఫీసు భవన శంకుస్థాపనకు వెళ్లిన సీఎం.. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.

తెలంగాణలో కొత్తగా 315 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 75,199 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 315 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,60,786కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,891కి చేరింది. కరోనాబారి నుంచి బుధవారం 340 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,470 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లుగా బులెటిన్‌లో పేర్కొన్నారు.

22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వు విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై ఒకటి లేదా రెండు రోజుల్లో గవర్నర్‌ తమిళసైను ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించనున్నారు.

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఏపీకి వెళ్తున్న నీటి విషయంలో ఆయన లేఖ రాశారు. శ్రీశైలంలో 880 అడుగుల పైన నీటి నిల్వ ఉన్నప్పుడు ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని ఈఎన్‌సీ కోరింది. ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్‌లో చేర్చాలని ఈఎన్‌సీ  లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల పనులను గెజిట్ రెండో షెడ్యూల్‌లో చేర్చాలని కోరింది.

ముగిసిన రవితేజ విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రవితేజ విచారణ ముగిసింది. రవితేజతో పాటు కెల్విన్ స్నేహితుడు జీషన్‌ను ఈడీ అధికారులు విచారణ జరిపారు. జీషన్ అలీఖాన్‌తో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. రవితేజ, జీషన్ మధ్య ప్రత్యక్ష లావాదేవీలు జరిగినట్లుగా విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. వీటి గురించి రవితేజ, జీషన్‌ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రవితేజ డ్రైవర్‌ను ఈడీ అధికారులు ఇవాళ విచారించారు.

మాంసం మార్కెట్లు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు

ఏపీలో మాంసం మార్కెట్లు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రూ.11.20 కోట్లతో 112 మటన్ మార్టులు ఏర్పాటుకు అడుగులు వేస్తుంది. దశల వారీగా మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ మటన్ అందించటమే లక్ష్యంగా మార్ట్ లు ఏర్పాటుచేస్తామంటోంది.  

సీఎం జగన్ అధ్యక్షతన  రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన  రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. రుణ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చ చేపట్టారు. రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాల మంజూరుపై  సీఎం ఆరా తీయనున్నారు. చిన్న, మధ్య తరగతి పర్రిశమలకు అందించే రుణ ప్రణాళికపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

గుంటూరు అత్యాచార ఘటన.. పోలీసుల అదుపులో 8 మంది అనుమానితులు!

గుంటూరు అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కోల్డ్ స్టోరేజీలో పనిచేస్తున్న ఒడిశా వాసులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

నేరేడుచర్లలో ప్రేమోన్మాది ఘాతుకం

తెలంగాణ నల్గొండ జిల్లా నేరేడుచర్లలో యువతిపై ఉన్మాది దాడి చేశాడు. యువతి గొంతు కోసి పరారయ్యాడు. యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో యువకుడు యువతి వెంట పడుతూ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. 

లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న లోకేశ్ ను విమానాశ్రయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతక ముందు  నారా లోకేశ్ హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. లోకేశ్‌ గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో నరసరావుపేట వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు నరసరావుపేట వెళ్లేందుకు లోకేశ్‌ నిర్ణయింంచారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ప్రేమోన్మాది అనూష అనే యువతి దారుణంగా హత్యచేశాడు. లోకేశ్ నరసరావుపేట పర్యటన కోసం వెళ్తున్న టీడీపీ నేతలలను నేతల పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు, గృహనిర్బంధం చేశారు.  


 






 


 


 

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద ఉద్ధృతి... భద్రాచలం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి 44 అడుగులు స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో  ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి 8.90 అడుగుల స్థాయికి పెరిగింది. దీంతో దిగువకు 6.37 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. విలీన మండలాల్లోని ఎటపాక మండల పరిధిలో నెల్లిపాక వీరాయ గూడెం ప్రధాన రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాల పరిధిలోని రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజి దిగువన ఉన్న లంక గ్రామాలకు వరద తాకిడి ఉండే పరిస్థితి ఉండటంతో  రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

తెలంగాణలో గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆదేశాలు జారీచేసింది. ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. తమ ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ ముందు హాజరైన హీరో రవితేజ

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ విచారణకు ఇవాళ సినీనటుడు రవితేజ హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టింది. 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది. ఇవాళ మరోసారి కెల్విన్ ను విచారణకు హాజరవ్వనున్నారు. కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తుంది. 

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... తాజాగా 43 వేల కొత్త కేసులు, 338 మరణాలు 

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా 40 వేల దిగువన వస్తున్న కొత్త కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18.17 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 43,263 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 6 వేల కేసులు పెరిగాయి. ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 338 మందిని వైరస్‌ బలితీసుకుంది. దేశంలో ఇప్పటివరకు 4,41,749 మంది కోవిడ్ తో  మరణించారు. 

ఏపీ అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ : నారా లోకేశ్

వైసీపీ పాలనలో ఏపీ అఘాయిత్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో వివాహిత అత్యాచార ఘటన బాధాకరమన్నారు. బైక్‌పై వెళ్తున్న జంటపై దాడి చేసి మహిళపై అత్యాచారానికి పాల్పడటం అమానుషమైన చర్యని తెలిపారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్తే తమ పరిధి కాదని పోలీసులు చెప్పడం ఏపీలో మహిళలకు రక్షణ లేదనటానికి నిదర్శనమన్నారు. మహిళలపై ఇన్ని ఘోరాలు జరుగుతున్న ప్రభుత్వంలో చలనం లేదని ఎద్దేవా చేశారు. పరామర్శకు వెళ్తుంటే వేల మంది పోలీసులను రంగంలోకి దించారని విమర్శించారు.  పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని లోకేశ్‌ విమర్శించారు. 


 

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు భారీగా చేరుతోంది. 



  • ఇన్ ప్లో : 87,103 క్యూసెక్కులు

  • ఔట్ ఫ్లో : నిల్ 

  • పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

  • ప్రస్తుత నీటిమట్టం 878.30 అడుగులు

  • పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం : 215 టీఎంసీలు

  • ప్రస్తుత నీటినిల్వ : 179.5140 టీఎంసీలు


శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. 

టీడీపీ నేతల గృహనిర్బంధం... పోలీసుల తనిఖీలు

గుంటూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. విజయవాడలో పలువురు టీడీపీ నేతలను హైస్ అరెస్ట్ చేశారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రామవరప్పాడులో కార్పొరేటర్ ఉషారాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో టీడీపీ నేత ఆలపాటి రాజాని గృహనిర్బంధం చేశారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద పోలీసుల భారీగా మోహరించారు. ప్రకారం బ్యారేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం

గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మేడికొండూరు పీఎస్‌ పరిధిలో మహిళపై నిన్న రాత్రి పాలడుగు అడ్డరోడ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తు్న్న దంపతులను అడ్డుకుని భర్తను కొట్టి మహిళను పొలాల్లోకి లాక్కెళ్లి దుండగులు అత్యాచారం చేశారు. నిన్నరాత్రి సత్తెనపల్లి పోలీస్​స్టేషన్​లో దంపతుల ఫిర్యాదు చేశారు. తమపరిధి కాదని సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకోనట్లు సమాచారం. 

Background

 అన్ని పథకాల కింద ముఖ్యమంత్రి డబ్బు ఇస్తున్నారు కానీ, తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ తాగేవాడిని మనం మార్చలేమన్న ఆయన.. తన దురదృష్టం ఏమిటంటే తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉందని తెలిపాలు. అర కిలోమీటరు దూరంలో ఉన్న అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతున్నారన్నారు.  మద్యం ఏరులై పారుతోంది అంటే తానేం చేయాలని ప్రశ్నించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.