Breaking News: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని : మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 31న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్యం మెరుగుపడలేదు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అమెరికా, సింగపూర్‌లలో చికిత్స చేయించుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరమయ్యారు. పార్టీ బాధ్యతలను తన భార్యకు అప్పగించారు. సెకెండ్ వేవ్ లో ఆయనకు కరోనా సోకింది. కొవిడ్ నుంచి కోలుకున్నా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తరచుగా వైద్య పరీక్షలకు వెళ్తున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పెద్దగా పాల్గొనలేకపోయారు. తాజాగా ఆరోగ్యం మళ్లీ విషమించడంతో ఆయన విదేశాలకు వెళ్తున్నట్లు తెలిసింది . చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్‌పై ఆయన వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెండు భారీ భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించింది. నిబంధనలకు విరుద్ధంగా వీటని నిర్మించారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని అధికారులకు తెలిపింది. కూల్చివేతకు అయ్యే ఖర్చును సూపర్‌టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపుగా వెయ్యి ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
సీఎం జగన్ ఎక్కడుంటే అదే రాజధాని అని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని అన్నారు. పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు, రేపు మరో ప్రాంతం కావచ్చు అన్నారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియెట్, అదే రాజధాని అని స్పష్టం గౌతంరెడ్డి తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి టీడీపీ శాసనసభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కి హాజరు కాలేదు. కమిటీ ముందు హాజరవ్వాలని వీరిద్దరికీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరు కాలేనని అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీకి సమాచారం పంపారు.
కూన రవికుమార్ మాత్రం ప్రివిలేజ్ కమిటీకి ఎలాంటి సమాచారం పంపలేదని తెలుస్తోంది. దీంతో ప్రివిలేజ్ కమిటీ కూన రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన ప్రివిలేజ్ కమిటీ మరొసారి సమావేశం అవుతుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ప్రివిలేజ్ కమిటీ వీరిద్దరికీ నోటీసులు పంపింది.
వరద నీటిలో చిక్కుకున్న టీఎస్ ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద చోటుచేసుకుంది. నిన్న వరద ఎక్కువగా ఉండటంతో గంభీరావుపేట శివారు మానేరు వాగు లోలెవల్ బ్రిడ్జి వద్ద బస్సు నీటిలో చిక్కుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులను స్థానికులు కాపాడారు. తర్వాత బ్రిడ్జిపై చిక్కుకున్న బస్సును జేసీబీ సాయంతో బయటకు తెచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. వరద ప్రవాహం అలాగే కొనసాగడంతో ఈరోజు బస్సు కొట్టుకుపోయింది. ఈ బస్సు.. మానేరు వాగు మధ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బస్సును ఈరోజు వెలికి తీసే అవకాశం ఉంది.
భారత పారాలింపియన్, షూటర్ సింగ్‌రాజ్ అధానా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో మూడో స్థానంలో నిలిచాడు. కాంస్య పతాకాన్ని ముద్దాడాడు.
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించాలన్న జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధన వద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు స్టే ఇచ్చింది. స్కూళ్లకు రావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని సూచించింది. గురుకులాలు, హాస్టళ్లు తెరవొద్దని ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని సూచించింది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మంగళవారం గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామంలో పర్యటించారు. నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్షలో పాల్గొనేందుకు ఆమె అనంతరావు పల్లి చేరుకున్నారు. ఉద్యోగం రాలేదనే మనస్థాపంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొప్పు రాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. రాజు కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అనంతరం గుండన్నపల్లి గ్రామంలో ఒక రోజు నిరాహార దీక్షా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇవాళ తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతమంది సుప్రీంకోర్టు జడ్జిలు ఒకేసారి ప్రమాణం చేస్తుండటం ఇదే మొదటిసారి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 9 మందితో కలిపి సుప్రీంలో న్యాయమూర్తుల సంఖ్య(సీజేఐతో కలిపి) మొత్తం 33కు చేరుతుంది.
జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ మాధుర్య త్రివేది, జస్టిస్ శ్రీనర్సింహ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. వీరితో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం అయ్యింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో 12 మందిని విచారించనున్న ఈడీ.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీకానేర్- జోధ్‌పుర్ హైవేపై ఓ కారు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురిని ఆసుపత్రిలో తరలించే క్రమంలో చనిపోయారు. క్షతగాత్రుల్లో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్ నుంచి ఉన్నతస్థాయి అధికారులకు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైస్ చైర్మన్‌గా అనితా రామచంద్రన్‌ను నియమించగా, పంచాయతీ రాజ్ కమిషనర్ గా శరత్ ను నియమించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా కృష్ణ భాస్కర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ గా రఘునందన్ రావుకు పోస్టింగ్ ఇచ్చారు. యూత్ సర్వీసెస్ డైరెక్టర్ గా వి. వెంకటేశ్వర్లు, మైనారిటీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా మహమ్మద్ అబ్దుల్ అజీంలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 14 మంది అధికారులు బదిలీ అయినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంటారు. 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు దిల్లీ వసంత్‌విహార్ మెట్రోస్టేషన్ సమీపంలోని 1300 గజాల స్థలంలో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
Background
ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి కడప జిల్లాలో పర్యటన చేయనుంది. సెప్టెంబరు ఒకటి సాయంత్రం 4.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయకు వెళ్తారు. 4.50గంటల నుంచి 5.50 గంటల వరకు పార్టీ నాయకులతో భేటీ అవుతారు. 6.00 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌లోని అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. సెప్టెంబరు 2న ఉదయం వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని తర్వాత తాడేపల్లికి తిరిగి వెళ్తారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -