Breaking News:  పొలం తగాదా విషయంలో ఘర్షణ.. కాల్పులు చేసిన మాజీ సైనికుడు.. ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 29న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 29 Aug 2021 09:08 PM
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు. వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్‍ను అరెస్ట్ చేసి ఏలూరు తీసుకువచ్చారు.  నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్తుండగా చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల విధులకు చింతమనేని ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన దెందులూరు పోలీసులు.. ఈ మేరకు అరెస్టు చేశారు.

 పొలం తగాదా విషయంలో ఘర్షణ.. కాల్పులు చేసిన మాజీ సైనికుడు.. ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో దారుణం జరిగింది. పొలం తగాదా విషయంలో ఘర్షణ తలెత్తి సాంబశివరావు అనే మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో.. శివ, బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మెుత్తం 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు  తెలుస్తోంది. ఘర్షణలో ఇరుపక్షాల మధ్య తలెత్తిన వివాదమే ఘటనకు కారణమని తెలుస్తోంది. మాజీ సైనికుడు సాంబశివరావు తన వద్ద ఉన్న పిస్టోల్ తో దగ్గర నుంచి కాల్పులు జరపడంతో.. శివ, బాలకృష్ణలకు.. తల, శరీర భాగాల్లో నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి. మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఇద్దరు చనిపోయారు. ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తికి గాయాలు కాగా, మెుదట మాచర్లకు తరలించగా.. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆధారాలతోనే రేవంత్ ఆరోపణలు: దాసోజు శ్రావణ్

మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ తెలిపారు. తొడలు, జబ్బలు కొట్టిన మల్లారెడ్డి ఇప్పుడేమో తాను అమాయకుడినని అంటున్నారని చెప్పారు. గుండ్లపోచంపల్లిలో.. సర్వే నంబర్‌ 650లో 16 ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఎలా ఎక్కిందని ప్రశ్నించారు. ఆ భూమిని మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. 1965 -66లో పహాణిలో 22.8 ఎకరాలు ఉందని, ధరణికి వచ్చేసరికి 33.26 ఎకరాలు ఉన్నట్లు చూపించారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ శాఖ కూడా సర్కార్ భూమి అని రిపోర్ట్ ఇచ్చిందని స్పష్టం చేశారు. 

తెలంగాణలో కొత్తగా 257 కోవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 257 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,57,376కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,870కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.

ఎమ్మెల్సీగా సురభి వాణీ దేవి ప్రమాణ స్వీకారం

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు.సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుపై 20,820 ఓట్లతో ఆమె గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.

రెండో రోజు కొనసాగుతున్న బండి సంజయ్ యాత్ర

బండి సంజయ్ రెండో రోజు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. సంగ్రామ యాత్రకు జనం భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇవాళ మెహిదీపట్నం, టోలీచౌకీ, షేక్ పేట్, గోల్కొండ కోట, లంగర్ హౌస్ మీదుగా పాదయాత్ర సాగనుంది. బండి సంజయ్ వెంట డీకే అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్, గరికపాటి, బాబు మోహన్, స్వామి గౌడ్, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం సాయంత్రం 4 గంటలకు గోల్కొండ కోట వద్ద ఏర్పాటు చేసిన సభలో బండి‌ సంజయ్ ప్రసంగించనున్నారు. ఈ రాత్రికి బాపు ఘాట్‌లో సంజయ్ బస చేయనున్నారు.

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ప్రగతి హాస్పిటల్ వద్ద జరిగిన ప్రమాదంలో బైక్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే చనిపోగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే ఆస్పత్రి లోనికి తీసుకెళ్లారు. వారు కూరగాయాల కోసం బైక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయని లేఖలో తెలిపారు. విభజన చట్టం ప్రకారం 6 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ లో చేర్చకపోవడానికి ఏపీ ప్రభుత్వం వైఫల్యమే కారణమని తెలిపారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాన్ని సాకు చూపి ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. దీంతో ప్రకాశం రైతులు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.  


 


 

కోడుమూరులో క్షుద్రపూజలు కలకలం

కర్నూలు జిల్లా కోడుమూరులో క్షుద్రపూజల కలకలం రేగింది. గూడూరు రహదారిలో హెచ్ పి గ్యాస్ గోడౌన్ వెనుక గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజల జరిపిన ఆనవాలు కనిపించాయి. రెండు మనిషి ఆకారపు బొమ్మలు, కుంకుమ, పసుపు, కొబ్బరి కాయలు ఉండడం చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎవరినో లక్ష్యంగా చేసుకుని పూజలు చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. మరికొందరు ఇదంతా మూఢనమ్మకాలని కొట్టిపడేశారు. 

విజయనగరంలో మహిళా ఎస్సై ఆత్మహత్య

విజయనగరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో  ఎస్సై భవానీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పీటీసీలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆమె తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో అడిషనల్ ఎస్‌.ఐ.గా విధులు నిర్వర్తిస్తున్నారు. శిక్షణలో భాగంగా విజయనగరం వచ్చినట్లు సమాచారం. 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై భవానీ... రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్ పొందారు. అవివాహిత అయినా భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం. ఎస్సై ఆత్మహత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


 

నేడు విశాఖకు పీవీ సింధు... స్టీల్ ప్లాంట్ అధికారులతో సమావేశం

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు ఆదివారం విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఉన్నతాధికారులతో సమావేశం అవ్వనున్నారు. సోమవారం ఉదయం ఉక్కు స్టేడియంలో పిల్లలతో కాసేపు సరదాగా  బ్యాడ్మింటన్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ రన్‌ను సింధు ప్రారంభిస్తారు. విశాఖ విమల విద్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ నుంచి ఉక్కు క్లబ్‌లోని ఎంపీ హాలులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 

జిలేబీలు, వడ ప్రసాదాలపై వివాదం... ఆలయ అధికారిపై చేయి చేసుకున్న సెక్యురిటీ గార్డు

చిత్తూరు జిల్లా కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో జిలేబీల, వడల తయారీపై వివాదం తలెత్తింది. వడలు, జిలేబీ ప్రసాదాల కోసం సెక్యురిటీ గార్డు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఘర్షణ పడ్డారు.  నిబంధనలకు విరుద్ధంగా జిలేబిలు, వడలు అధిక మొత్తంలో తయారుచేసినట్లు సెక్యురిటీ గార్డు ఆరోపిస్తున్నారు. ప్రసాదాలను టెంపుల్ ఇన్స్పెక్టర్ కుమార్ అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఘర్షణలో టెంపుల్ ఇన్స్పెక్టర్ కుమార్ పై సెక్యురిటీ గార్డు శ్రీనివాస్ చేయి చేసుకున్నాడు. టీటీడీ ఆధీనంలో‌ని వేణుగోపాల్ స్వామి ఆలయంలో ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

200వ రోజుకు చేరుకున్న విశాఖ ఉక్కు కార్మికుల నిరసన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు భారీ మానవహారం చేపట్టారు. విశాఖలోని అగనంపూడి నుంచి అక్కిరెడ్డి పాలెం వరకు మానవహారంలో నిలబడ్డారు. ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రతిపక్షపార్టీ నేతలు పాల్గొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 10 కి.మీ మానవహారంలో ఉక్కు పరిశ్రమ కార్మికుల కుటుంబాలు, విశాఖ నగరవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మానవహారం, ర్యాలీ కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏ

ఖమ్మం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

ఖమ్మం జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. చింతకాని మండలం జగన్నాథపురం సమీపంలో ఓ కారు వాగులోకి దూసుకెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి విజయవాడవైపు వెళ్తున్న కారు జగన్నాథపురం వద్ద బొమ్మల వాగులోకి దూసుకెళ్లింది. వెంటనే గమనించిన స్థానికులు కారులో ఉన్నవారిని బయటకు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Background


 దిశ యాప్ SOS తో అలర్ట్ తో  ఓ యువతి రక్షించారు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల  పోలీసులు. ఓ యువతి బంధువులతో కలిసి గుత్తికొండ బిలం చూసేందుకు వెళ్లింది. అయితే దర్శనం తర్వాత బంధువులు ఆటోలో బయలుదేరారు. యువతి స్కూటీపై వెనుక వస్తుంది. కొంత దూరం వచ్చాక భారీ వర్షం పడడంతో కొద్దిసేపు నిరీక్షించేందుకు చెట్టు కింద ఆగింది. జోరు వాన, చీకటి పడుతుండడంతో ముందుకు వెళ్లడం ఇబ్బందిగా భావించి ఆందోళన చెందింది. దిశ యాప్ SOS బటన్ నొక్కి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దిశ SOS కు వచ్చిన కాల్ పై స్పందించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్, ఎస్సై చరణ్ కి సమాచారం ఇచ్చారు. వెంటనే బాధితురాలిని రక్షింంచారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.