Breaking News: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీడీపీ నిరసనలు... పలువురి అరెస్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 28 Aug 2021 03:32 PM
తెలంగాణలో 325 కోవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 325 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,57,119కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 3,869కి చేరింది. నిన్న కోవిడ్ బాధితుల్లో 424 మంది కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో రికవరీల సంఖ్య 6,47,185కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 6,065 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం బులెటిన్‌ విడుదల చేసింది. 

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీడీపీ ధర్నా.. పలువురు అరెస్ట్

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు తెదేపా నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను గృహనిర్బంధం చేశారు. అనేకచోట్ల చెక్​పోస్టులు ఏర్పాటు చేసి ఆందోళనలను అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేశారు.

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనపై IPC 306, 511 సెక్షన్స్ పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఫిర్యాదుదారు ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలిస్తామని కోర్టు న్యాయమూర్తి తెలిపారు. తీన్మార్‌ మల్లన్న తరఫున వాదిస్తున్న ఉమేష్‌ చంద్ర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టాలని తీన్మార్ మల్లన్నను ఏడు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

సెక్రటేరియట్‌లో ఆఫీసులు ఎక్కడున్నాయో సీఎంకు తెలుసా?

‘‘తెలంగాణలో సెక్రెటేరియట్‌లో ఉన్న వివిధ శాఖల ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు తెలుసా? ఆ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన చెప్పాలని నేను సవాలు చేస్తున్నా.. ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా సెక్రటేరియట్‌కి వెళ్లని ముఖ్యమంత్రిని మీరెక్కడైనా చూశారా? రాష్ట్రంలో ఒక నీతిమంతమైన పాలన రావాల్సిన అవసరం ఉంది.’’ అని కిషన్ రెడ్డి మాట్లాడారు.


 


కల్వకుంట్ల కుటుంబమే బంగారంగా మారింది: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగస్థులకు జీతాలివ్వలేని పరిస్థితి వస్తుంది. బంగారు తెలంగాణ అంటారు.. కానీ అప్పుల తెలంగాణగా మార్చారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారంగా మారింది. రూ.లక్షల కోట్లను పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఒవైసీ, కల్వకుంట్ల కుటుంబాలు రెండింటింకే ప్రజలు రాష్ట్రాన్ని దత్తత ఇచ్చారు. వారే ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.’’ అని అన్నారు.

భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్ పూజలు

బండి సంజయ్‌ చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పూజలు చేసిన బండి సంజయ్, అక్కడి నుంచి చార్మినార్ దేవాలయానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. తొలి రోజు పాదయాత్ర అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం, లక్డీకాపూల్‌ మీదుగా మెహిదీపట్నం వరకు సాగుతుంది. మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో బండి సంజయ్ శనివారం రాత్రి బస చేస్తారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌ ఛుగ్‌, ముఖ్యనేతలు డీకే అరుణ, అరుణ్‌ సింగ్‌, లక్ష్మణ్‌, మురళీధర్‌రావు, సత్యకుమార్‌ తదితరులు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.





దేశంలో కొత్తగా 46,759 కేసులు, 509 మరణాలు

దేశంలో కోవిడ్​ కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు 40 వేలకు పైగా నమోదైంది. దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు వచ్చాయి. మరో 509 మంది మరణించారు. 31,374 మంది కరోనా​ను జయించారు. 

గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, కుమారుడు సజీవదహనం

పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి, కుమారుడు సజీవ దహనం అయ్యారు. పెదమైనవానిలంక గ్రామానికి చెందిన బొమ్మిడి నాగరాజు ఇంట్లో నుంచి శనివారం తెల్లవారుజామున పొగలు వచ్చాయి. అనంతరం గ్యాస్ సిలిండర్‌ పేలి మంటల్లో బొమ్మిడి నాగరాజు(35), కుమారుడు రోహిత్ కుమార్(6) సజీవ దహనం అయ్యారు. నాగరాజు భార్య, మరో కుమారుడు బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

చంచల్‌గూడ సమీపంలో పిల్లి గుడిసెల బస్తీలో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ ఆలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట్ ఎమ్మెల్యే బలాల, మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

కాసేపట్లో మలక్ పేటకు కేటీఆర్

మంత్రి కేటీఆర్ కాసేపట్లో మలక్ పేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు. గతంలో మురికివాడగా ఉన్న బస్తీలో రూ.24.91 కోట్ల వ్యయంతో ఒకటిన్నర ఎకరాల స్థలంలో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్‌ఎంసీ నిర్మించింది. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ 560 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఒక్కొక్క డబుల్ బెడ్ రూమ్ ఖర్చు రూ.8.65 లక్షల వ్యయం అయింది.

నిర్మల్: పెళ్లి వాహనం బోల్తా.. వధువు, తండ్రి అక్కడికక్కడే మృతి

నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో పెళ్లి కూతురు మౌనిక, ఆమె తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు. పెళ్లి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర బల్లర్షాలోని రాజురాకు రిసెప్షన్‌ కోసం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి

హైదరాబాద్ శివారులోని చౌటుప్పల్‌‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పో్యారు. చౌటుప్పల్‌ మండలంలోని ధర్మోజిగూడెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వేబ్రిడ్జి నుంచి లారీని రివర్స్‌ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో బైకు దాన్ని ఢీకొంది. మృతుల్లో ఒకరు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వాసి హరీశ్‌, మరో ఇద్దరు హైదరాబాద్‌ రామాంతాపూర్‌ వాసులుగా గుర్తించారు. ఈ ముగ్గురు హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా పని చేస్తుంటారని పోలీసులు తెలిపారు.

బండి సంజయ్ పాద యాత్రకు పోలీసుల అనుమతి

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు చేపట్టి ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు.  ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఈ యాత్ర ఇవాళ ప్రారంభం కానుంది.  

Background

ట్యోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భవీనాబెన్‌ పటేల్‌ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో చైనా క్రీడాకారిణిపై భవీనాబెన్‌ విజయం సాధించింది. జాంగ్‌ మియావోపై 3-2 తేడాతో ఓడించింది. ఫైనల్‌కు చేరిన భవీనా భారత్‌కు పతకాన్ని ఖరారు చేసింది. పోలియో జయించిన భవీనాబెన్ పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.