Breaking News:   తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 24 Aug 2021 10:38 PM
  తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ

అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు సంబందించిన ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ. 8లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వాళ్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఎంఆర్ఓ ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారని, ధ్రువపత్రం తప్పని తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాలో భర్తీ కాని సీట్లను తదుపరి ఏడాదికి బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్‌ నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు.

తెలంగాణ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్

తెలంగాణ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్ నియమితులయ్యారు.  ఏడీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకూ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న టీ.ప్రభాకర్ రావు బదిలీ అయ్యారు.

 సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. డిసెంబర్‌లో మరో 15 రోజులు సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నారు. కరోనా వల్ల గతేడాది ఒక్కరోజే బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టు!

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్​ రాణేను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రిని కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అరెస్టు ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

బంగాళాఖాతంలో భూకంపం...ఏపీలో స్వల్ప ప్రకంపనలు!

బంగాళాఖాతంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదు అయ్యింది. దీంతో ఏపీలోని పలు తీర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అఫ్గానిస్థాన్ వెళ్లిన ఉక్రెయిన్ విమానం హైజాక్​

అఫ్గానిస్థాన్​ లో చిక్కుకున్న ఉక్రెయిన్ ప్రజలను తరలించేందుకు వెళ్లిన విమానం హైజాక్ అయ్యింది. ఎవరు హైజాక్ చేశారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. హైజాకర్లు ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్​కు దారిమళ్లించినట్లు ఉక్రెయిన్ విదేశాంగ సహాయమంత్రి తెలిపారు. హైజాక్ అయిన విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 

కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27 జరగాల్సిన సమావేశం సెప్టెంబర్ 1కి వాయిదా పడింది. 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మంత్రి హరీశ్ రావు బాసట... ఆసుపత్రికి తరలింపు

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై ప్రమాదం జరిగింది. భార్య, పిల్లలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి చెట్టును ఢీకొట్టాడు. అదే దారిలో ప్రయాణిస్తున్న మంత్రి హరీశ్ రావు... ప్రమాదాన్ని చూసి ఆగారు.  ప్రమాదంలో గాయపడిన ఆ కుటుంబాన్ని‌ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట ఆసుపత్రికి పంపించారు.  

గుంటూరులో రమ్య కుటుంబ సభ్యులను కలిసిన ఎస్సీ కమిషన్ బృందం

గుంటూరులో ఇటీవల హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను జాతీయ ఎస్సీ కమిషన్ బృందం కలిసింది.  రమ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించింది. అంతకు ముందు ఎస్సీ కమిషన్ బృందాన్ని విజయవాడలో టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ నేతలు నక్కా ఆనంద బాబు, వర్ల రామయ్య, శ్రావణ్ కుమార్ ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిశారు.  రాష్ట్రంలో జరిగిన దాడులను సభ్యులకు వివరించారు. సాయంత్రం మరోసారి కలవాలని టీడీపీ నేతలకు కమిషన్ బృందం అపాయింట్ మెంట్ ఇచ్చింది.  

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 8 వేల టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెల వరకు 5వేల టికెట్లను విడుదల చేసిన టీటీడీ, ఈసారి 8 వేల టికెట్లు విడుదల చేసింది. 

దేశంలో కొత్తగా 25,467 కరోనా కేసులు, 354 మరణాలు

భారత్​లో రోజువారీగా కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. దేశంలో కొత్తగా 25,467 మందికి కరోనా సోకింది. మరో 354 మంది మరణించారు. సోమవారం 39,486 మంది కరోనా​ను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 3,19,551గా ఉంది.

కర్నూలు జిల్లాలో వైసీపి నాయకుల దౌర్జన్యం.. దళిత మహిళపై దాడి, తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లాలో వైసీపి నాయకులు దార్జన్యానికి పాల్పడ్డారు. మహానంది మండలం ఆర్.ఎస్.గాజులపల్లె గ్రామంలో ఎస్.సి కాలనీకి చెందిన ఓ దళిత మహిళపై, ఆమె బందువులపై దాడికి పాల్పడ్డారు. రోడ్లు లేక అవస్థ పడుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. పలు చోట్ల రోడ్లు వేశారని, తమ కాలనీకి రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించడంతో వైసీపీ నేతలు తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. మహిళకు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం.

రాహుల్ హత్యకేసు: పోలీసుల అదుపులో కోగంటి సత్యం.. ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకు తరలింపు

విజయవాడలో కలకలం సృష్టించిన యువ పారిశ్రామిక వేత్త రాహుల్‌ హత్య కేసులో నిందితుడైన రౌడీషీటర్‌ కోగంటి సత్యం పోలీసులు బెంగళూరులో అదుపులోకి చేశారు. సత్యాన్ని బెంగళూరులోని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. ఈ హత్య కేసులో సత్యం ఏ4 నిందితుడిగా ఉన్నారు. విజయవాడలో అతడిని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. 

నేడు అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ దాదాపు 7 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో మంగళవారం రూ.666.84 కోట్లు జమ చేయనున్నట్లు  రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.10వేలలోపు డిపాజిట్‌ చేసిన 3.86 లక్షల మంది బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి రూ.459.23 కోట్లను చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

Background

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్‌ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన నాగేశ్వరరావు (44), జయరావ్‌ (42), మల్లికార్జున్‌ (40)గా ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.