YS Sunitha: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ పురోగతిని తెలియచేయాని తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకూ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.                


2019 మార్చి 14న అర్ధరాత్రి వివేకా హత్య జరిగింది. మొదట పోలీసుల విచారణ సరిగ్గా లేకపోవడంతో సీబీఐ విచారణ కోసం సునీత పోరాడారు. సీబీఐ విచారణ తర్వాత సీబీఐ అధికారులకు అడ్డంకులు ఎదురవుతూండటంతో  విచారణ హైదరాబాద్ లో జరిపేలా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.  విచారణ చేపట్టిన సీబీఐ ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ అధికారులు కొన్ని పత్రాలకు సంబంధించి హార్డ్‌ డిస్క్‌లో ప్రతివాదుల తరఫు న్యాయవాదులకు ఇచ్చారు. అవి ఓపెన్ కాకపోవడం వల్ల ప్రింటింగ్ ప్రతులు కావాలని కోరారు. లక్షల పేజీలు ఉండటం వల్ల ప్రింటింగ్ కాపీలు ఇవ్వడం కుదరదు కాబట్టి హార్డ్ డిస్కులు ఓపెన్ చేయాలని సీబీఐ అధికారులు అంటున్నారు.  ల దాదాపు 15 నెలలుగా విచారణ ముందుకు సాగడం లేదు. ఆరు నెలల్లో ఈ విచారణ ముగించేలా ఆ కోర్టును ఆదేశించాలని సునీతకోరుతున్నారు.                


మరో వైపు జగన్ అక్రమాస్తల కేసులను రోజువారీగా విచారించాలని మాజీ మంత్రి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణలో భాగంగా  కేసుల పురోగతిని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. మొత్తంగా ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా జగన్ కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టనున్నారు. ఈ క్రమంలో మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి... వాటి పురోగతి ఏమిటి అన్న అంశాలపై ప్రభుత్వ లాయర్ ను ఆరాతీశారు. పూర్తి వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వ ఏఏజీ కోరడంతో ఈ నెలాఖరులోపు పూర్తి సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.              


ప్రజా ప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణలో పురోగతిని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. గతంలో రోజు వారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయితే  కేసుల విచారణలో పురోగతి లేకపోవడం, కొన్ని హైకోర్టుల నుంచి సరైన సమాచారం ఇవ్వకపోవడం, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఇటీవలి విచారణలో సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధించిన విషయంలో పెద్దగా పురోగతి లేకపోగా... వాటికి ఈ ఏడాది కాలంలో మరికొన్ని కేసులు తోడయ్యాయని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ఈ కేసుల్లో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8, 9కి ముడిపడి రాజ్యంగపరమైన కొన్ని అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసులను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో విచారించనున్నారు.