Breaking News 25 September: హైదరాబాద్ లో భారీ వర్షం... ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగరవాసులకు జీహెచ్ఎంసీ సూచన 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 25న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 25 Sep 2021 08:41 PM
హైదరాబాద్ లో భారీ వర్షం... ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ సూచన 

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేటలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అంబర్‌పేటలో భారీ వర్షం కారణంగా ముసారాంబాగ్‌ బ్రిడ్జి మీదుగా మూసీ వరదనీరు ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. 


 


 

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ఐక్యరాజ్యసమితి 76వ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్ అని అన్నారు. ప్రపంచం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఎన్నడూ చూడని విపత్తు ఇది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచం అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయుల ప్రగతి ప్రపంచానికి దోహదం చేస్తుందన్నారు.

భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు

వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎల్లుండి తలపెట్టిన భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతి తెలిపింది. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆ మేరకు ప్రకటన చేశారు. భారత్‌ బంద్‌కు మద్దతుగా ఈ నెల 27 అర్ధరాత్రి నుంచి 28 మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రైతు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఎల్లుండి దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. 

త్వరలో ఏపీ మంత్రి వర్గంలో భారీ మార్పులు: మంత్రి బాలినేని

ఏపీ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని ఆయన అన్నారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు స్పష్టం చేశామని బాలినేని అన్నారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనన్నారు. తనకు పార్టీ ముఖ్యం కానీ పదవులు కాదని పేర్కొన్నారు. 

ఏపీలో కొత్తగా 1167 కరోనా కేసులు, 7 మరణాలు

ఏపీ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 55,307 మంది నమూనాలు పరీక్షించగా 1,167 కొత్త కేసులు నమోదయ్యాయి. 7గురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,487 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. 

రూ.700 కోట్ల కార్వీ షేర్లను స్తంభింపజేసిన ఈడీ

స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీ షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద కార్వీపై కేసు నమోదు చేసిన ఈడీ.. రూ.700కోట్ల విలువైన షేర్లను నిలిపివేసింది. హైదరాబాద్‌ సీసీఎస్‌, సైబరాబాద్‌ పరిధిలో కార్వీపై బ్యాంకులు ఫిర్యాదు చేశాయని ఈడీ పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. కార్వీ సంస్థ షేర్‌ హోల్డర్ల షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రూ.2,873 కోట్ల రుణాలు తీసుకుందని ఈడీ వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా కార్వీ రుణం పొందిందని.. బ్యాంకుల రుణాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారని తెలిపింది.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షకావత్‌తో ముగిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. 5 అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డుల పరిధిలో ఉంచాలని విన్నవించారు. జల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించారు. గెజిట్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని మరోసారి కోరారు.

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రాజస్థాన్​లోని జైపుర్​ జిల్లా చాక్సూ గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. శనివారం రీట్​ పరీక్ష రాసేందుకు బారన్​ నుంచి సీకార్​ ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

కాకినాడ జీఎంఆర్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రతీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీఎంఆర్‌ పవర్‌ ప్లాంట్‌లో జరిగిన ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. వెల్గింగ్‌ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అందుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Background

ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు ప్రమాదం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముంది. ఈ తుపానుకు పాకిస్థాన్‌ పెట్టిన ‘గులాబ్‌’ అనే పేరును ఖరారుచేసే అవకాశాలున్నాయి. శుక్రవారం రాత్రి వాతావరణ విభాగం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం... బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం వాయుగుండంగా మారింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.