Breaking News Live Updates: డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని జప్తు చేయవద్దు : తెలంగాణ హైకోర్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా నవంబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలు జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది. మద్యం తాగిన వ్యక్తి బండి నడిపితే బంధువులను పిలిచి వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకపోతే పీఎస్ కు తరలించి తర్వాత అప్పగించాలని ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది.
హనుమకొండలో వైద్యుల నిర్లక్ష్యానికి బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు మృతి చెందాడు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ కిందపడిపోయిన జునైద్ పాషా(8) శుక్రవారం చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వలనే బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నామని డబ్బులు కట్టించుకొని, చివరికి మరణించాడని డాక్టర్లు చెప్తున్నారని కుటుంబసభ్యుల ఆవేదన చెందుతున్నారు. హాస్పిటల్ ముందు బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
చత్తీస్ గడ్ దంతేవాడలో పోలీసులు, ఇంద్రావతి ఏరియా కమిటీ నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. గీదమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో DRG జవాన్లు, నక్సలైట్ల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన నక్సల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన నక్సలైట్ రామ్సుగా గుర్తించారు. అతనిపై 5 లక్షల రివార్డ్ ఉన్నట్టు గుర్తించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో 7.62 ఎంఎం పిస్టల్, 5 కిలోల ఐఈడీ, వైర్, రోజువారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ దున్నపోతు హల్‌చల్ చేసింది. రోడ్డు మీదకు వచ్చి కనిపించిన వారిపై దాడి చేసింది. ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. ఎదురుగా కనిపించిన వారి మీద దాడి చేసింది. దున్నపోతును కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. దున్నపోతు స్కూటీతో పాటు ఓ మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకోగలిగారు.
తెలంగాణ రంగారెడ్డి నార్సింగ్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. నార్సింగ్ పీఎస్ పరిధి పుప్పాల్ గూడలో యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం దొరకడంలేదన్న ఒత్తిడితో మహ్మద్ అజాజ్ అనే యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహమ్మద్ అజాజ్ హుమాయూన్ నగర్ కు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి లీలామహల్ సర్కిల్‌లో కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. పార్క్ చేసి ఉన్న బైక్ లను ఢీకొట్టింది. శుక్రవారం కొత్త కారు కొని షోరూం నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ప్రమాదం జరిగింది. పార్క్ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి.
అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 14 మంది విద్యార్తులకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురై విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు తల్లితండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థులను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. 7 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో రేపట్నుంచి ఈనెల 20 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 24న ప్రత్యేక విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనుంది. ఇప్పటివరకు మూడు విడతల్లో 1,97,722 డిగ్రీ సీట్ల భర్తీ చేశారు. మిగిలిన 2,19,693 సీట్ల భర్తీకి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం షోరూంలో పోకిరీలో రెచ్చిపోయారు. ఏకంగా షోరూంలోని ట్రయల్స్ రూంలో కెమెరాలు పెట్టి ఇద్దరు యువకులు రికార్డు చేస్తున్న విషయాన్ని ఇద్దరు యువతులు గుర్తించారు. వారు వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ ఇద్దరు యువకులు సహా షోరూం మేనేజర్‌ను అరెస్టు చేశారు.
కార్తీక మాసం మొదటి రోజు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పవిత్ర గోష్పాద క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి భక్తులు పోటేత్తుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేశారు. మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్‌నాథ్ ఆలయం నాలుగు పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దీనిని చార్ ధామ్ అని పిలుస్తారు. ఇందులో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ఆలయ పర్యటన కోసం శుక్రవారం డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ఉత్తరాఖండ్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు. ఆలయ సందర్శన అనంతరం అక్కడే ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేదార్ నాథ్‌లో కొన్ని శంకుస్థాపనలు మోదీ చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్రత ముఖర్జీ(75) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ముఖర్జీ కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ నేత మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతపురం జిల్లాలో పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారిని ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. వీరిని యాకుబ్ అనే 62 ఏళ్ల వ్యక్తి, నారాయణ అనే 60 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
అనంతపురం జిల్లా పామిడిలోని 44వ నెంబరు హైవేపై కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. వీరిది గార్లదిన్నె మండలం కొల్లపగొండ ప్రాంతంగా గుర్తించారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరంతా పెద్ద వడుగూరు మండలం కొట్టాలపల్లిలో పత్తి కోతకు వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జు నుజ్జు కాగా శరీరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
Background
హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుడు సంభవించింది. చత్రినాక సమీపంలోని కందికల్ గేటు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరొక ఇద్దరికి గాయాలయ్యాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేసే పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. అందులో బాణా సంచాకు నిప్పు అంటుకోవడం వల్ల పెలుడు సంభవించి అగ్ని ప్రమాదానికి దారి తీసినట్లుగా భావిస్తున్నారు. చనిపోయిన వారిని పశ్చిమ బంగాల్‌కు చెందిన విష్ణు అనే 25 ఏళ్ల వ్యక్తి, జగన్నాథ్ అనే 30 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీశారు. క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాణా సంచాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో వాడే రసాయనాలు కలవడం వల్ల పేలుడు తీవ్రత మరింత పెరిగిందని పోలీసులు చెప్పారు.
మరోవైపు, దీపావళి సంబరాల సందర్భంగా టపాకాయలు కాల్చుతూ నగరంలో దాదాపు 20 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. గాయపడ్డ బాధితులు మెహదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రితో పాటు పలు ఆస్పత్రుల్లో చేరారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఎన్‌హెచ్-44పై ప్రమాదం
హైదరాబాద్ శివారులో బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నట్టుండి బ్రేక్ వేయడంతో శాంత్రో కారు బస్సును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారంతా షాద్ నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గోల్నాకలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో గోల్నాకలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహయంతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Nellore: నెల్లూరులో టపాసుల విక్రయాలు అంతంతమాత్రమే.. వ్యాపారులు లబోదిబో, కారణం ఏంటంటే..
Also Read: AP Corona Update: ఆంధ్రప్రదేశ్ లో 301 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -