Breaking News Live: టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 23 Oct 2021 10:07 PM
టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత

కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత కాట్రగడ్డ బాబు మృతిచెందారు. విజయవాడ లబ్బిపేటలోని ఆయన నివాసంలో శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. కాట్రగడ్డ బాబు మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.

న్యాయవ్యవస్థ లేకపోతే జగన్ నియంతలా మారేవారు : గోరంట్ల

పట్టాభి విడుదలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. న్యాయ వ్యవస్థ లేకపోతే జగన్ నియంతలా మారేవారని ఆరోపించారు. కోర్టులు  లేకపోతే  జగన్ లో  ఒక హిట్లర్ ని చూసేవాళ్లమన్నారు. అధికారపార్టీ ధర్నాలు చేసే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ లో  ఉందని విమర్శించారు.


 

హయత్ నగర్ హత్యలో కొత్త కోణం... వివాహేతర సంబంధమే కారణం

హైదరాబాద్ హయత్ నగర్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కారులో దారుణ హత్యకు గురైన లారీ డ్రైవర్ కాచిగూడకి చెందిన మహుమద్ ముస్తాక్ గా గుర్తించారు. మృతుడు భార్య, తమ్ముడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. హత్య జరిగిన అనంతరం నగర శివారులలో మృతదేహాన్ని పడేసేందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. రోడ్డుపై కారు ఆగిపోవడంతో మృత దేహాంపై కారం చల్లి వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య, తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. 

టీడీపీ నేత పట్టాభి బెయిల్ పై విడుదల

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్ బెయిల్ పై విడుదలయ్యారు. సీఎం జగన్ పై  అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. శనివారం హైకోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాజమంత్రి జైలు నుంచి విడుదల అయ్యారు.  

తీవ్ర కడుపునొప్పితో బాలుడు మృతి... విషప్రయోగం జరిగిందని బంధువుల ఆరోపణ

కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరులో దారుణం చోటు చేసుకుంది. రెండు సంవత్సరాల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో బాలుడిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కడుపు నొప్పి ఎక్కువ కావడంతో కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అల్లిఫీర సాబ్, మాబిల కుమారుడు ముహమ్మద్ (2)అనే బాలుడిపై విషప్రయోగం జరిగిందని బంధువుల అనుమానం వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యులే  ఘటనకు పాల్పడ్డారని బాలుడి తల్లి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని మోదీ భేటీ

కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ ఇటీవల అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశంలో 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ పూర్తి అయిన సందర్భంగా కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీరం ఇనిస్టిస్టూట్ కు చెందిన ఆధార్ పునావాలా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, మరో కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

తిరుపతి విఖ్యాత్ థియేటర్ లో అగ్నిప్రమాదం

తిరుపతి భూమా సినీ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ థియేటర్లో ప్రదర్శనలు నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. భూమా కాంప్లెక్స్ లో విఖ్యాత్ థియేటర్ లో బాల్కనీలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో 180 సీట్లు వరకు అగ్నికి ఆహుతి అయ్యాయి. సకాలంలో తిరుపతి అగ్నిమాపక శాఖ రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. సుమారు రూ.5 లక్షలు మేర ఆస్థి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు

టీడీపీ నేత పట్టాభిరామ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో పట్టాభిపై కేసులు నమోదయ్యాయి.  కింద కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 

తెలంగాణలో భూకంపం.. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల భూప్రకంపనలు

తెలంగాణలో పలు చోట్ల భూమి కంపించింది. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లాలోని రాంనగర్, గోసేన మండల్ కాలనీ, నస్పూర్‌లలో భూమి కంపించించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.

మేడ్చల్ లో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

తెలంగాణలో మేడ్చల్ లో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని మహేష్, పవన్, రామకృష్ణగా గుర్తించారు. సూడెంట్స్ లక్ష్యంగా డ్రగ్స్ తెస్తున్నట్లు పోలీసులు అంటున్నారు.   

హుజూరాబాద్ లో దద్దమ్మ గెలవాలా? అసెంబ్లీని దద్దరిల్లించే వాళ్ళు గెలవాలా?: కిషన్ రెడ్డి

హజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం అంబాలలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.  ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 1500 మంది ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. సకల జనుల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని.. కానీ మామా అల్లుడు,తండ్రీ కొడుకు,తల్లీ కూతురు పాలన నడుస్తుందని ఆరోపించారు.  హుజురాబాద్ కు దద్దమ్మ గెలువాలా?అసెంబ్లీ దద్దరిల్లించే వాళ్ళు కావాలా ?ప్రజలు ఆలోచించాలని కోరారు. ధైర్యవంతుడు ఈటలను గెల్పించాలని కోరారు.

Background


పోడు భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుంది. కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సీఎం భేటీ అయ్యారు. పోడు భూముల సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. అడవుల పరిరక్షణ, హరితహారంపైనా సమావేశంలో చర్చ జరుగుతుంది.


తెలంగాణలో పలు చోట్ల భూమి కంపించింది. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం 2:03 ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలోని రాంనగర్, గోసేన మండల్ కాలనీ, నస్పూర్‌లలో భూమి కంపించించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.


వారం రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శనివారం) అతి స్వల్పంగా తగ్గాయి. భారత్ మార్కెట్లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,460గా కొనసాగుతోంది. మూడు రోజులుగా భారీగా పెరిగిన వెండి భారత్ మార్కెట్లో ఈ రోజులు రూ.400 తగ్గింది ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి.


అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఉపాధిహామీ పనులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.  విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల గ్రామ సచివాలయాల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఈ పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమాలు ఉంటాయని సీఎం అన్నారు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ పని మీద దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనకు సోమవారం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారయింది. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించి..   రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. అయితే చంద్రబాబు పర్యటన అంతటితో ఆగిపోయే అవకాశం లేదు. ప్రముఖ నేతలను కలుస్తారు. పాత రాజకీయ మిత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.