Breaking News Live: టీడీపీ కార్యాలయంపై దాడి.. 10 మందికి పోలీసుల నోటీసులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 22న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 22 Oct 2021 10:56 PM
టీడీపీ కార్యాలయంపై దాడి.. 10 మందికి పోలీసుల నోటీసులు

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులిచ్చారు. శేషగిరి పవన్ కుమార్, అడపాల గణపతి, పానుగంటి చైతన్య, పల్లెపు మహేశ్‌, షేక్ అబ్దుల్లా, గోకా దుర్గాప్రసాద్‌, కోమటిపల్లి దుర్గారావు, జోగా రమణ,  లంకా అధినాయుడు, పేరూరి అజయ్‌కు నోటీసులు జారీ చేశారు.

పట్టాభి వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరిపాలా.. చంద్రబాబుకు బొత్స కౌంటర్

ఒకప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి రావొద్దని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పందంగా ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో దివాలా తీసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్న బొత్స.. పట్టాభి వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరిపాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా అసహనంతో ఉన్నారని చెప్పారు.  

ముగిసిన చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష

టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ముగిసింది. నిరసన దీక్ష ముగింపులో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలన్నారు. ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఉన్నాయన్నారు. సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం సమీపంలోనే దాడి జరిగిందని ఆరోపించారు. ఏపీలో రూ.లక్ష కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్న చంద్రబాబు... విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో మద్యం నియంత్రణ పారదర్శకంగా జరిగిందన్నారు. పట్టాభి మాటలనను వక్రీకరించారన్నారు. కల్తీ మద్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తుందన్నారు. 

ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ ప్రకటించారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్‌ ఉంటాయి. ఈనెల 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన, 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ఉంటుంది. నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయిస్తారు. నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది. నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు, నవంబరు 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తారు. 

బీజేపీ నేత ఈసీకి రాసిన లేఖను బయటపెట్టిన మంత్రి హరీష్ రావు

బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖని మంత్రి హరీష్ రావు బయటపెట్టారు. బీజేపీ నేత రాసిన లేఖను ఆధారం చేసుకునే కేంద్ర ఎలక్షన్ కమిషన్ దళిత బంధుని నిలిపివేశారని హరీష్ రావు ఆరోపించారు. ఈటల రాజేందర్ లేఖ రాయకపోయినా... తన పార్టీ నేత రాసిన లేఖ ఆధారంగానే దళితబంధు నిలిపివేశారన్నారు. అయినా బీజేపీ  నేతలు ఏ మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్నారు. 

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు కేసులో ఆరుగురి అరెస్ట్

ఏపీ హైకోర్టు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో గతంలో అదుగురిని అరెస్ట్ చేయగా తాజాగా శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.  

ఇంటర్ పరీక్షలు ఆపలేమని తేల్చిచెప్పిన తెలంగాణ హైకోర్టు...

ఈ నెల 25 నుంచి జరిగే తెలంగాణ ఇంటర్ పరీక్షలను ఇప్పుడు ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు... ఇంటర్ బోర్డు పరీక్షలకు నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పింది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైందని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 58 మంది ఇంటర్ విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరవ్వనున్నారు. 

కొనసాగుతున్న వైసీపీ జనాగ్రహ దీక్షలు

తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభిరామ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలు జిల్లాలో వైకాపా ఆధ్వర్యంలో నిరసన దీక్షలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలిలో ఏర్పాటు చేసిన ఈ దీక్ష కార్యక్రమంలో కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పేదలకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడు మృతి

రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడు అనీష్‌ మృతి చెందాడు. అతని మృతదేహం ఇంటి వెనకాలే ఉన్న చెరువులో లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. నిన్న మధ్యాహ్నం నుంచి అనీష్‌ కనిపించకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు. కాగా, ఈ రోజు శవమై చెరువులో కనిపించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక బొమ్మ కొనివ్వని కారణంగా బాలుడు మారాం చేశాడని, అదే క్రమంలో బయటకు వెళ్లిన తమ చిన్నారి అనీష్‌ ఇలా శవమై కనిపించాడని తల్లిదండ్రులు తెలిపారు.

చంద్రబాబుకు ఫోన్‌ చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి

చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫోన్ చేసి పరామర్శించారు. చంద్రబాబు దీక్షకు ఫోనులో సంఘీభావం తెలిపిన ఆయన వ్యక్తిగత పనుల వల్ల రాలేకపోయానని చెప్పారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. అందరం కలిసి పనిచేద్దామని నారాయణ చంద్రబాబుకు సూచించారు. 

Background

చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్‌కు రెండో రోజు కార్యకర్తల తాకిడి కొనసాగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్షకు మద్దతుగా రెండో రోజు కార్యకర్లు తరలివస్తున్నారు. నిన్న రాత్రి 10.30 తర్వాత దీక్షా స్థలిపైనే చంద్రబాబు పడుకున్నారు. ఉదయం 5 గం.కు నిద్రలేచి మళ్లీ దీక్ష కొనసాగించారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకూ చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. చంద్రబాబుకు కాసేపట్ల డాక్టర్లు పరీక్షలు నిర్వహించనున్నారు. 


మరోవైపు, మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చే మార్గంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రహదారిపై బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డుపెట్టారు. పోలీసులు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చేవారిని అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయిపై మాట్లాడితే ఎదురుదాడులా? అని ప్రశ్నించారు. తప్పుచేసిన అధికారుల జాబితా సిద్ధమవుతోందని.. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.


Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..


పట్టాభికి రిమాండు
మరోవైపు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం రాత్రి సమయంలో ఇంటి తలుపులు విరగ్గొట్టి మరీ పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. నవంబర్ 2 వరకు పట్టాభికి రిమాండ్ విధించారు. దీంతో మచిలీపట్నం సబ్‌జైలుకు పట్టాభిని తరలించే అవకాశం ఉంది. 


కోర్టులో పట్టాభిని హాజరు పరిచిన సమయంలో ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్‌ పరిశీలించాలంటూ పట్టాభి న్యాయమూర్తిని కోరారు. తనకు నోటీస్ ఇవ్వకుండానే రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని తెలిపారు. మధ్యవర్తులు లేకుండానే తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని న్యాయమూర్తికి తెలిపారు. అయితే పోలీసులు కొట్టలేదని న్యాయమూర్తికి పట్టాభి చెప్పినట్లుగా తెలుస్తోంది. 


Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.