Technical Issue of Anganwadi Joining: గత నెల రోజులుగా చేపట్టిన సమ్మె విరమించి విధుల్లోకి వచ్చిన అంగన్వాడీలకు (Anganwadi) పాలనాపరమైన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. తొలుత రాష్ట్రవ్యాప్తంగా 80 వేల పైచిలుకు సిబ్బందిని తొలగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మంత్రి బొత్స (Minister Botsa) ఆ సంఘాల ప్రతినిధులతో సోమవారం రాత్రి  చర్చలు జరపగా సఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది మంగళవారం నుంచి విధుల్లో చేరాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విధుల్లోకి వచ్చిన అంగన్వాడీల నుంచి జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని టెర్మినేషన్ ఆర్డర్లు రద్దు చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.


జాయినింగ్ రిపోర్టు ఇచ్చేందుకు విముఖత


అయితే, తమను నేరుగా విధుల్లో చేరాలని మంత్రుల కమిటీ సూచించిందని అంగన్వాడీలు తెలిపారు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వబోమని చెప్పారు. దీంతో రిపోర్ట్ ఇవ్వని వారికి తాళాలు ఇచ్చేందుకు సూపర్వైజర్లు విముఖత వ్యక్తం చేశారు. టెర్మినేషన్ ఆర్డర్లు రద్దు చేయాలంటే జాయినింగ్ రిపోర్ట్ తప్పనిసరి అని ఐసీడీఎస్ పీడీలు స్పష్టం చేసిన క్రమంలో అంగన్వాడీ కేంద్రాల వద్దే వర్కర్లు, హెల్పర్లు నిరీక్షిస్తున్నారు.


సుదీర్ఘ చర్చలు


వేతనాల పెంపు సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మెకు దిగారు. పలు ధపాలుగా ప్రభుత్వం వీరితో చర్చించినా ఫలితం లేకపోయింది. అంగన్వాడీల మేజర్ డిమాండ్స్ పరిష్కరించామని.. త్వరలోనే జీతాలు కూడా పెంచుతామని సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. అయినా వారు ససేమిరా అనడంతో.. సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న వారిని తొలగించి కొత్త వారిని తీసుకోవాలని ఆదేశించింది. అయినా, వారు వెనక్కు తగ్గలేదు. అంగన్వాడీ సిబ్బందికి మద్దతుగా బంద్ కు కూడా పిలుపునిచ్చారు. దీంతో సోమవారం రాత్రి అత్యవసరంగా అంగన్వాడీల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది. అంగన్వాడీల 13 డిమాండ్లలో 10 డిమాండ్లు నెరవేర్చామని.. మిగతా డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం జగన్ తో చర్చిస్తామని మంత్రి బొత్స తెలిపారు. ఈ ప్రకటనతో అంగన్వాడీలు సమ్మె (Anganwadi Strike) విరమణకు ఉపక్రమించారు.


ప్రభుత్వం ఆమోదించిన డిమాండ్లివే



  • వచ్చే జులైలో జీతాల పెంపునకు ఒప్పుకోలు. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపు చేస్తోంది.

  • ప్రమాద బీమాగా రూ.2 లక్షలు. అద్దె భవనాల్లో ఉన్న అంగన్‌వాడీ సెంటర్లకు రూ.66.54 కోట్ల నిధులు మంజూరు.

  • అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కోసం అవసరమైన చీపుర్లు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 55,607 సెంటర్లకి రూ.7.81 కోట్ల నిధులు మంజూరు. 

  • సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్స్, చిన్నపాటి మరమ్మతుల క్రింద 21,206 అంగన్వాడి సెంటర్స్ కు ఒకొక్క కేంద్రానికి రూ.3000 చొప్పున రూ.6.36 కోట్ల నిధులు విడుదల. 

  • అంగన్వాడీ సహాయకులను అంగన్‌వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితిని 45 సంవత్సరాల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ G.O.MS:44 తేది 20.12.2023 జారీ.

  • అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, అంగన్‌వాడీ హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతి.

  • అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కొనసాగింపుకు గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ వర్కర్లుకు రూ.1 లక్ష, హెల్పర్లకు రూ.40,000 సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని ఉత్తర్వులు.


Also Read: శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాకు కారణాలేంటి ?- టీడీపీలో సీటు కన్ఫామ్ అయిందా?