Nara Lokesh :    తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో ప్రారంభించబోతున్న పాదయాత్ర కోసం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆయన బయట కనిపించడం లేదు. పాదయాత్ర రూట్ మ్యాప్.. ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో యువగళంలో యువత ను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా పార్టీ కోసం పని చేస్తున్న యువ నాయకులు, కార్యకర్తల గురించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. తన పాదయాత్ర సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి ఎవర్నైనా కలవాలంటే ఇబ్బంది అవుతుందని.. సోషల్ మీడియా సైనికుల్ని..  యువ నేతల్ని పిలిచి వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు.. నేరుగా వారితో నేరుగా టచ్‌లోకి వెళ్తున్నారు. ఈ పరిణామం  టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని సంతోషానికి గురి చేస్తోంది. 



పార్టీ కార్యకర్తలకు పర్సనల్‌గా మెసెజులు


డియర్ శ్రీనివాస్.. మీరు ప్రభుత్వ నిర్బంధాల్ని ఎదుర్కొని పోరాడుతున్న వైనం అద్భుతంగా ఉంది. నేను మీకు అండగా ఉంటాను అని నారా లోకేష్ నుంచి పర్సనల్ వాట్సాప్ నెంబర్ నుంచి మెసెజ్ వస్తే.. సగటు టీడీపీ కార్యకర్తలకు ఎలా ఉంటుంది. గాల్లో ఎగురుతున్నట్లే ఉంటుంది. ఇలాంటి అనుభూతి చాలా మంది టీడీపీ కార్యకర్తలకు కలిగింది. ఎందుకంటే నారా లోకేష్ ఇలా వందల మంది టీడీపీ కార్యకర్తలకు మెసెజ్ చేశారు. అంత తీరిక ఆయనకు ఉందా .. ఇదంతా చాట్  బోట్ ద్వారా చేస్తున్నారని కొంత మంది అనుకున్నారు. ఎవరేమనుకున్నా.. తమను గుర్తించారన్న ఓ ఆనందం మాత్రం కార్యకర్తలకు కలిగింది. 


సోషల్ మీడియా కార్యకర్తలను పిలిచి మాట్లాడిన లోకేష్ 


ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ కోసం స్వచ్చందంగా పని చేసే కార్యకర్తల లోకేష్  ప్రత్యేకంగా కలిశారు. ప్రతీ రోజూ పదుల సంఖ్యలో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందరితో సమావేశం పెట్టి ప్రసంగించి వెళ్లడం లాంటి పనులు చేయకుండా ఒక్కొక్కరితో సమావేశం అయ్యారు. వారికి ఎలాంటి  సమస్య వచ్చినా తానున్నానని భరోసా ఇచ్చి పంపించారు. దీంతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మరితం ఉత్సాహంగా పని చేస్తున్నారు. లోకేష్ పార్టీలోని యువశక్తిని యాక్టివేట్ చేస్తున్నారని .. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం 
టీడీపీలో వినిపిస్తోంది. 


టీడీపీ కార్యకర్తల సంక్షేమాన్ని చాలా కాలంగా చూసుకుంటున్న  లోకేష్ 


తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా లోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని చూస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే సంప్రదాయాన్ని టీడీపీతోనే ప్రారంభించారు. ఈ ఆలోచన లోకేష్ దేనని టీడీపీ వర్గాలు చెబుతూంటాయి. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక  వ్యవస్థను ఏర్పాటు చేశారని.. ఇప్పుడు అంది వచ్చిన టెక్నాలజీ సాయంతో ఆందరితోనూా దగ్గర సంబంధాలు పెంచుకుంటున్నారని అంటున్నారు. లోకేష్ తీరుతో పార్టీలో యువత మరింత చురుకుగా పని చేస్తోందని అంటున్నారు.