TDP will announce BC declaration On 5th March : టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం జరిగింది. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. జగన్ రెడ్డి పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉంటుందన్నారు. జగన్ చేసిన మోసం నుండి కోలుకుని ఎదిగేలా ప్రోత్సహించడమే టీడీపీ లక్ష్యమని.. స్పష్టం చేశారు. మంగళవారం నాగార్జున యూనివర్సిటి ఎదురుగా భారీ సభ ఏర్పాటు చేశారు. అందులో డిక్లరేషన్ ను ప్రకటించారు. టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మంగళవారం జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారు.
జనసేన కూడా ఈ డిక్లరేషన్ కమిటీలో భాగంగా ఉంది. ఇందులో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, కాల్వ శ్రీనివాసులు, బీద రవిచంద్ర, అనగాని సత్యప్రసాద్, పంచుమర్తి అనూరాధ, బండారు సత్యనారాయణమూర్తి, రామారావు, గౌతు శిరీష, బీకే పార్థసారథి, కొనకళ్ల నారాయణ, గుంటుపల్లి నాగేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, రవికుమార్, జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాసయాదవ్, పీ మహేశ్, చిల్లపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
బీసీల అభ్యున్నతి కోసం నిజంగా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. బీసీలే తమ డిక్లరేషన్ ను రూపొందించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందని కొల్లు రవీంద్ర వెల్లడించారు. బీసీలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చడమే టీడీపీ లక్ష్యం అని స్పష్టం చేశారు. బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించామని తెలిపారు. అభిప్రాయ సేకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో 850 సమావేశాలు నిర్వహించామని కొల్లు రవీంద్ర వివరించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీకులగణన నిర్వహణకు సంబంధించిన అంశాల్ని కూడా డిక్లరేషన్లో ప్రకటిస్తామన్నారు. జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచీ బీసీలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ సోదరుల నినాదాలతో తాడేపల్లి ప్యాలెస్ కంపించాలని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
బీసీ డిక్లరేష్ తర్వాత ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను కూడా టీడీపీ ప్రకటించనుంది. ఇప్పటికే టీడీపీలోని ఆయా వర్గాల నేతలు.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని డిక్లరేషన్‌లో పొందు పర్చాల్సిన అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు. త్వరలో జనసేన నేతలతో కూడా కలిసి.. బహిరంగసభలు ఏర్పాటు చేసి.. డిక్లరేషన్లను ప్రకటించే అవకాశం ఉంది.