TDP Stuns YS Jagan in Pulivendula: పులివెందులలో వైసీపీకి డిపాజిట్ గల్లంతు.. అసలు వినడానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేని ఈ పరిణామం నిజంగానే జరిగింది. పులివెందులలో పసుపు జెండా ఎగిరింది. పూల అంగళ్లలో తెలుగుదేశం సంబరం చేసింది. జగన్ ప్రెస్‌మీట్ సాక్షిగా తెలుగుదేశం విజయం నిన్ననే ఖరారు అయిపోయినా.. ఇవాళ అధికారిక ఫలితాల్లో టీడీపీ జగన్ పార్టీని చిత్తు చిత్తు చేసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ 6033 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి భార్య, మారెడ్డి లతారెడ్డి 6716ఓట్లు పొందగా.. వైసీపీ అభ్యర్థి హేమంత్‌ రెడ్డి 683 ఓట్లు సాధించారు.

౩౦ఏళ్ల తర్వాత పులివెందులలో..

1978 నుంచి పులివెందుల నియోజకవర్గం వైఎస్‌ ఫ్యామిలీ అడ్డా. 78లో వైఎస్ రాజశేఖరరెడ్డి.. రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచినప్పటి నుంచి ఇప్పుటి వరకూ 12 సార్లు పులివెందులకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అన్నిసార్లూ వైఎస్ కుటుంబ సభ్యులే గెలిచారు. వైఎస్, ఆయన భార్య విజయమ్మ, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి, ఆయన కుమారుడు , మాజీ సీఎం జగన్ మోహనరెడ్డి గెలిచారు. 2019లో అక్కడ జగన్ మెజార్టీ 90వేల మార్క్‌ను కూడా దాటింది. దీనిని బట్టే ఆ కుటుంబానికి పులివెందులలో ఉన్న పట్టు అర్థం చేసుకోవచ్చు. 1983లో తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి  ఈ నియోజకవర్గంలో 1995 స్థానిక ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలవగలిగింది. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల, వేల్పుల, వేముల మండలాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. పులివెందుల మండలంలో మాత్రం  టీడీపీ ఎన్నడూ గెలవలేదు.  ౩౦ఏళ్లుగా పులివెందుల మండలంలో అసలు ఎన్నికలే జరగలేదు. అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ ఏకగ్రీవంగా గెలుస్తోంది. అలాంటి చోట  వైసీపీని తెలుగుదేశం మట్టికరిపించింది.

అసలు ఇవి ఎన్నికలే కాదు.. జరిగింది రిగ్గింగ్… అని వైఎస్సార్సీపీ ముందే రిజల్ట్ తేల్చేసింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం కొత్త విషయమేం కాదు. మంత్రాంగంలో మందుంటారు. యంత్రాంగం వాళ్ల కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడూ అదే జరిగింది. ఏదైనా రిజల్ట్ అనేదే ఫైనల్ కాబట్టి ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీని తెలుగుదేశం చావుదెబ్బ కొట్టినట్టే.. ఫస్ట్ టైమ్ జగన్ ఇలాకాలో ఆయన పార్టీని దెబ్బతీయడం నిజంగా టీడీపీకి పొలిటికల్‌గా పెద్ద మైలేజ్.

కలిసికట్టుగా కదం తొక్కి..

పులివెందుల ఎన్నికలను టీడీపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. మరో ఏడాదిలో జెడ్పీ పదవీకాలం పూర్తవుతుంది. మామూలుగా పదవి పూర్తైతేనే స్థానిక ఎన్నికలు చంద్రబాబు అంత తొందరగా నిర్వహించరు అనే పేరుంది. అలాంటిది తప్పుకుండా గెలిచి తీరతామన్న నమ్మకంతోనే… ఈ సారి వీళ్లు రంగంలోకి దిగారు. పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దించారు. జమ్మలమడగు నుంచి ఆదినారాయణ రెడ్డి మొత్తం ఎన్నిక బాధ్యతను తనపై ఉంచుకుని పనిచేశారు. మంత్రి సవిత కూడా నియోజకవర్గంలోనే ఉండి గెలుపుకోసం ప్రయత్నాలు చేశారు.

జగన్‌పై అగ్రెసివ్‌గా వెళ్లడం ద్వారా బీటెక్ రవి పులివెందులలో కొద్ది కొద్దిగా ఆదరణ పెంచుకుంటున్నారు. 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి.. వైఎస్ వివేకానందరెడ్డిపై గెలుపొందడం మొదటి మలుపు.. 2024లో రవి జగన్ మెజార్టీ తగ్గించడంలో సక్సెక్ అయ్యారు. 2024 ఎన్నికల్లో జగన్ మెహనరెడ్డి మెజార్టీ ఏకంగా 30వేలకు పైగా తగ్గింది. ఇప్పుడు తన భార్యను నించోబెట్టి … తానే అభ్యర్థిగా మండలంలో తిరిగారు..

కుప్పంను కొడతామని…

వైనాట్ 175 పేరుతో కుప్పుంను కూడా కొట్టేస్తామంటూ సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీ చూపించిన అత్యుత్సాహం కూడా టీడీపీ శ్రేణులు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడానికి ఓ కారణం. అప్పట్లో కుప్పంలో నాలుగు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మునిసిపాలిటీలను కూడా గెలుచుకున్న ఊపులో వైసీపీ కుప్పుం అసెంబ్లీ స్థానాన్ని కొడతామని చెప్పింది. దానికి పోటీగా చంద్రబాబు పులివెందుల వచ్చి వైనాట్ పులివెందుల అన్నారు. రెండు అసెంబ్లీల్లో రిజల్ట్ మారలేదు కానీ.. కుప్పుం స్థానిక ఎన్నికల్లో జరిగిన పరాభవానికి టీడీపీ ప్రతీకారం  తీర్చుకుంది. అది కూడా డిపాజిట్ రానంత రేంజ్‌లో వైసీపీని ఓడించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తానే ఎమ్మెల్సీగా గెలిచిన బీటెక్‌ రవి.. ఇప్పుడు మరోసారి తన భార్యను గెలిపించుకున్నారు.