ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓటు కీలకంగా మారింది. ఆత్మ ప్రభోదానుసారం ఓటువేశానని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద టీడీపీ గెలుపుతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ గెలుపు కోటంరెడ్డి సోదరులకు మరింత ఉత్సాహాన్నిచ్చిందనే చెప్పాలి. దీంతో కోటంరెడ్డి ఆఫీస్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. 


ఆనం పాత్ర కూడా కీలకం..
అటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేశానన్నారు. ఆయన్ను కూడా వైసీపీ ఇబ్బంది పెట్టడంతో పార్టీ నుంచి బయటకొచ్చేశారు. ఆయన స్థానంలో వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్ చార్జ్ ని కూడా ప్రకటించారు జగన్. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించలేకపోయారు. కనీసం అధికారులు కూడా ఆయన కార్యక్రమాలకు రావడంలేదు. ఆయన ఇంటికే పరిమితం అయ్యారు, ఓ దశలో ఆనం నెల్లూరు రూరల్ కి వస్తారనుకున్నా, కోటంరెడ్డి కూడా వైసీపీని వీడటంతో ఆ సీటుపై తకరారు మొదలైంది. అసలు ఆనం ఏవైపు ఉంటారు, టీడీపీలో చేరతారా లేదా అనేది కూడా సందిగ్ధంలో పడింది. కానీ ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేశారు, టీడీపీతో టచ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీకి ఉత్సాహం వచ్చింది. టీడీపీలో చేరాలనుకుంటున్న వైసీపీ రెబల్స్ కూడా అదే ఉత్సాహంలో ఉన్నారు. 


నెల్లూరే కీలకం..
ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు పేరే మారుమోగిపోయింది. నెల్లూరు నుంచి ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రభోదానుసారం అంటూ వైసీపీకి షాకిచ్చారు. ఒకరకంగా ఈ ఇద్దరు రెబల్స్ వైసీపీకి దూరం జరగకపోయి ఉంటే టీడీపీ అభ్యర్థిని దింపే ఆలోచనే చేసి ఉండేది కాదేమో. టీడీపీ అభ్యర్థిని బరిలో దింపడం, వైసీపీ రెబల్స్ ఇద్దరూ ఆత్మప్రభోదానుసారం ఓటు వేయడం, వారితోపాటు మరో ఇద్దరూ కూడా జతకలవడంతో టీడీపీకి విజయం సునాయాసమైంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఏకంగా 23ఓట్లు వచ్చాయి. విజయానికి ఒక ఓటు అధికంగా రావడం టీడీపీకి మరింత సంతోషాన్నిచ్చే విషయం. 


నెల్లూరులో సంబరాలు.. 
ఇటీవల తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా నెల్లూరు టీడీపీ నేతలు కీలకంగా పనిచేశారు. కంచర్ల శ్రీకాంత్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా గెలుపొందారు. స్థానిక వైసీపీ నేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని ఆయన ఓడించారు. ఈ ఓటమిలో కూడా రెబల్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని తెలుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అనుచరులతో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయించారు. దీంతో టీడీపీ అభ్యర్థి గెలుపు సునాయాసంగా మారింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నెల్లూరు ఓటు కీలకంగా మారడం విశేషం. 


ఇక శుక్రవారం టీడీపీలో చేరబోతున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఈ విజయం మంచి ఉత్సాహాన్నిస్తుందనే చెప్పాలి. అటు పార్టీ కార్యాలయంలో కూడా అందరూ ఫుల్ జోష్ తో ఉంటారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముందుగా  పార్టీలోకి వెళ్తున్నారు. ఎన్నికలనాటికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరతారు.