Mahanadu 2026 Resolutions List:    తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ  మహానాడు  నిర్వహణపై ఆ పార్టీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది మే 27, 28 తేదీల్లో నిర్వహించనున్న  మహానాడు-2026 ను  స్త్రీ శక్తి థీమ్‌తో చేపట్టాలని గురువారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఇంధన పొదుపు  కారణంగా  ఆధునిక సాంకేతికతను జోడిస్తూ ఈ సమావేశాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.      స్త్రీ శక్తి థీమ్‌తో పండుగలా నిర్వహణకు టీడీపీ సిద్ధం! 

Continues below advertisement

పార్టీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఈసారి మహానాడును పూర్తిగా మహిళా శక్తిని ప్రతిఫలించేలా నిర్వహించాలని నిర్ణయించింది. వర్చువల్‌గా జరిగిన పొలిట్ బ్యూరో భేటీలో సీఎం చంద్రబాబు   టీడీపీ హయాంలో మహిళలకు కల్పించిన ఆస్తి హక్కు, రాజకీయ ప్రాతినిధ్యం ,  ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రధానంగా చర్చించాలని సూచించారు. మహానాడు వేదికపై జరిగే ప్రసంగాలు, ప్రదర్శనలు కూడా మహిళా సాధికారతను చాటిచెప్పేలా ఉండాలని ఆదేశించారు.

 మొత్తం 20 తీర్మానాలు - రాజకీయ ముసాయిదా సిద్ధం

Continues below advertisement

ఈ మహానాడులో చర్చించి ఆమోదించడానికి మొత్తం 20 తీర్మానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 10, తెలంగాణకు సంబంధించి 4, అండమాన్ నికోబార్‌కు 1 తీర్మానం ఉండగా.. మరో 4 ఉమ్మడి తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఒక  కీలక రాజకీయ తీర్మానం  చేపట్టనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడులు ,  ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ తీర్మానాలు ఉండనున్నాయి.   

 మన దేశం - మన బాధ్యత 

ఇంధన పొదుపు , పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన  మన దేశం-మన బాధ్యత  కార్యక్రమంపై మహానాడులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. పొలిట్ బ్యూరో సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించడం ద్వారా తామే స్వయంగా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే, గత ప్రభుత్వ అరాచకాలను, ప్రస్తుత ప్రభుత్వ పారదర్శకతను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నవతరం కార్యకర్తలకు ఎన్టీఆర్ సిద్ధాంతాలు, పార్టీ చరిత్ర తెలిసేలా ప్రత్యేక ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు.

 ప్రతి ఇంటిపై పసుపు జెండా - గ్రామగ్రామాన వేడుక      

మహానాడును కేవలం వేదికకే పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. రెండు రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరేయాలని, అన్ని క్లస్టర్ల పరిధిలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మహానాడును ప్రారంభించాలని పిలుపునిచ్చారు.