Bharat Ratna For NTR :  తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడులో ఈసారి కూడా ఒక సంప్రదాయం పునరావృతమైంది. తెలుగుజాతి గర్వకారణం, మహానటుడు ఎన్టీఆర్‌కు  భారతరత్న  ప్రకటించాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమని కొనియాడారు. లోకేష్ ప్రతిపాదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్లను పార్టీలోనే అమలు చేద్దామంటూ ఆయన ఇచ్చిన పిలుపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపినప్పటికీ, అందరి దృష్టి మాత్రం భారతరత్న తీర్మానం పైనే ఉంది.

Continues below advertisement

 దశాబ్దాల డిమాండ్ - అందని గౌరవం

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదు. గత మూడు దశాబ్దాలుగా ప్రతి మహానాడులోనూ టీడీపీ ఈ తీర్మానం చేస్తూనే ఉంది. గతంలో చంద్రబాబు కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్  ప్రభుత్వాకు కీలకంగా వ్యవహరించినప్పటికీ  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయారు.  వాజ్‌పేయి హయాంలో ఎన్డీయే ప్రభుత్వానికి కింగ్ మేకర్‌గా ఉన్నప్పుడు కూడడాా గౌరవం ఎన్టీఆర్‌కు దక్కలేదు.  రాజకీయ కారణాల వల్ల  ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.  

Continues below advertisement

 కింగ్ మేకర్‌గా బాబు - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? 

ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకం. టీడీపీ మద్దతు లేకుండా కేంద్ర ప్రభుత్వం మనగడ సాగించడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించుకోవడం చంద్రబాబుకు పెద్ద కష్టమైన పని కాదు.  కేంద్రంలో పట్టు ఉన్నప్పుడే ఈ పని పూర్తి చేయాలి.. లేకపోతే మరో మహానాడులో మళ్ళీ ఇదే తీర్మానాన్ని చదువుకోవాల్సి వస్తుంది అని  క్యాడర్  భావిస్తున్నారు. ఈసారి కేవలం తీర్మానానికే పరిమితం కాకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి భారతరత్న సాధించాలని ప్రయత్నిస్తున్నారు.   

 మహిళా రిజర్వేషన్లు - ఒక ముందడుగు  

మహానాడు రెండో రోజున చంద్రబాబు చేసిన మరో కీలక ప్రకటన మహిళా రిజర్వేషన్లు. లోకేష్ ప్రతిపాదించిన 33 శాతం కోటాను పార్టీ పదవుల్లోనూ, 2029 అసెంబ్లీ టికెట్ల కేటాయింపులోనూ అమలు చేస్తామన్న ప్రకటన సాహసోపేతమైనదే. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావడానికి ముందే, టీడీపీ దీన్ని ఆచరణలో చూపిస్తామని చెప్పడం ద్వారా మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఉందని చంద్రబాబు అభివర్ణించారు. అభిమానుల ఆకాంక్షలు, రాజకీయ అవసరాలు ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ ఖ్యాతి భారతరత్న అవార్డుకు అతీతమైనది. కానీ, ఒక రాజకీయ పార్టీగా టీడీపీ తన వ్యవస్థాపకుడికి ఆ అత్యున్నత గౌరవాన్ని ఇప్పించుకోవడం అనేది వారి నైతిక బాధ్యత. కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈసారి ఎన్టీఆర్ జయంతి నాటికైనా ఆ ప్రకటన వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. తీర్మానాలు చేయడం కంటే, ఫలితాలు సాధించడంపైనే క్యాడర్ ఆశలు పెట్టుకుంది.