Gorantla Madhav Video: అధికార పార్టీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగు యువత నిరసనలు చేశారు. వైసీపీ ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఆందోళనలను అడ్డుకునే క్రమంలో అర్బన్ సీఐ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
మీ వాళ్లు చేయలేదా?
నిరసనల్లో భాగంగా గోరంట్ల దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు తెలుగు యువత ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. ఒక బాధ్యతగల స్థానంలో ఉండి, ఎంపీ అయిన వ్యక్తి ఇలా వ్యవహరిస్తారా అని టీడీపీ శ్రేణులు ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ కుప్పంలో అర్బన్ సీఐ శ్రీధర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాళ్లు దండిగా ఉంటారని గోరంట్లకు మద్దతుగా మాట్లాడారు. మీవాళ్లు ఇలా చెయ్యలేదా అంటూ అడ్డంగా వాదించారు. దేశాన్ని కాల్చండి అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పోలీస్ యూనిఫాంలో ఉండి దేశాన్ని కాల్చండి అంటూ సీఐ వ్యాఖ్యలు చెయ్యడంపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దేశాన్ని కాల్చెయ్ అంటూ వ్యాఖ్యలు చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సీఐ శ్రీధర్, ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకే బ్యాచ్ కు చెందిన అధికారులు అని తెలుస్తోంది. తన స్నేహితుడిని వెనకేసుకుని వచ్చే క్రమంలోనే సీఐ శ్రీధర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని టీడీపీ తెలుగు యువత ఆరోపిస్తున్నారు.
అసలేంటి గోరంట్ల మాధవ్ వివాదం?
కొన్ని రోజుల కిందట హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. వైరల్ గా మారిన ఆ వీడియోల ఎంపీ మాధవ్ చొక్కా లేకుండా ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడారని ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. టీడీపీ శ్రేణులు ఆ వీడియోను తెగ వైరల్ చేశారు. దీనిపై రాజకీయం దుమారం రేగడంతో గోరంట్ల మాధవ్ ఆ వీడియోపై వివరణ ఇచ్చారు. తాను జిమ్ లో ఉండగా ఆ వీడియో తీసుకున్నానని, దానిని ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ అన్నారు. టీడీపీ నాయకులే కుట్ర పూరితంగా ఈ పని చేశారని ఎంపీ ఆరోపించారు. దీనిపై జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీడీపీ కి చెందిన కొందరు వ్యక్తులు చేసిన కుట్ర అని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు.
మహిళా కమిషన్ సీరియస్
వైసీపీ ఎంపీ అశ్లీల వీడియో వ్యవహారం, వివాదంపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. విచారణ చేపట్టి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని, తప్పు చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. అయితే గోరంట్ల మాధవ్ వీడియోపై అటు ప్రతి పక్షాలు, ఇటు మహిళా సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.