TDP Leaders: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బుధవారం టీడీపీ నేతల బృందం కలిసింది. ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమాతో కూడిన బృందం గవర్నర్‌ను కలిసి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్రంలో చోటు జరుగుతున్న పరిణామాలను వివరించారు. 50 పేజీలతో కూడిన వివరాలను గవర్నర్‌కు అందజేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు, ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసుల్లో టీడీపీ వేసిన పుస్తకాలను గవర్నరుకు సమర్పించారు. 


చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, టీడీపీ నాయకుల గృహ నిర్బంధం వంటి అనేక అంశాలను గవర్నర్ దృష్టికి టీడీపీ నేతలు తీసుకు వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని గవర్నరుకు టీడీపీ శ్రేణులు వివరించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులేంటీ..? అందులోని వాస్తవాలేంటి..? అనే అంశాన్ని టీడీపీ నేతలు గవర్నర్‌కు వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో గవర్నర్‌ను టీడీపీ నేతలు కలవడం ఇది రెండో సారి. 


సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమరావతిలో ప్రజావేదిక బద్దలు కొట్టినప్పటి నుంచి తాజాగా చంద్రబాబు అరెస్ట్ వరకు 50 పేజీలతో కూడిన రిపోర్ట్ అందించినట్లు చెప్పారు. ఈ విషయాలపై వాస్తవాలను గుర్తించి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. గవర్నర్ స్పందిస్తూ.. తన అధికారాల మేరకు చేయవల్సినదంతా చేస్తానని హామీ ఇచ్చినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. రాజ్యాంగ సంస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. తనపై, చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఒక్క చిన్న ఆధారం కూడా లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఆలయాలపై దాడుల గురించి గవర్నర్‌కు వివరించామన్నారు. 


చంద్రబాబుపై కేసు పెట్టి 40 రోజులు జైలులో పెట్టారని, ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేదన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసిన నాయకుడిని ఒక ఉగ్రవాదిలా అర్ధరాత్రి అరెస్ట్ చేశారని అన్నారు. నాలుగేళ్ల 8 నెలల్లో కేవలం టీడీపీ నేతలపై కేసు పెట్టారని ఆరోపించారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాజకీయ కక్షలతో వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ లకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రతిపక్షాల మీద, రాజ్యాంగం మీద గౌరవం లేకుండా జగన్ తన స్వార్థమే అజెండాగా అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు కాపాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే కక్ష పూరిత వేధింపులను అడ్డుకోవాలని, రూల్ ఆఫ్ లా కాపాడమని కోరినట్లు యనమల వివరించారు.


టీడీపీ నేతలతో నారా లోకేష్ సమావేశం
చంద్రాబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో సీనియర్ నాయకుడు బుచ్చెయ్య చౌదరి, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, కాలువ శ్రీనివాసులు, పలువురు సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పరమైన అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని లోకేష్ వారికి సూచించారు.