TDP On Vijaisai : జగన్ , విజయ సాయి రెడ్డి తమ ఇంటి పేర్లు మార్చుకొని కుంభకోణాల రెడ్డి అని పెట్టుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సలహా ఇచ్చారు. విశాఖలో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. విజయ సాయి రెడ్డి కాదు... సారాయి రెడ్డి అని అన్నారు. లిక్కర్ కుంభకోణంలో ఎంపీ విజయ సాయి రెడ్డి అల్లుడు, సోదరుడి పాత్ర ఉందని తెలిపారు. సజ్జల తాడేపల్లి గుమస్తా అని విమర్శించారు. ఇంత జరుగుతున్నా సజ్జల, విజయ సాయి రెడ్డి బుకాయిస్తున్నారన్నారు. మోదీపై వ్యక్తిగత విభేదాలు లేవని... మోదీ పర్యటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. వైసీపీ నేతల కుంభకోణాలపై ప్రధాని దృష్టి పెట్టాలని కోరారు. మోదీ సభకు మూడు రాజధానులకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారన్నారని బండారు సత్యనారాయణ తెలిపారు. వైసీపీ నేతల కుంభకోణాల పై ప్రధాని దృష్టి పెట్టాలని బండారు సత్యనారాయణ కోరారు.
మూడు రాజధానులపై ప్రధానితో ప్రకటన చేయించాలి !
మూడు రాజధానులే తమ విధానం అంటున్న వైఎస్ఆర్‌సీపీ ఈ మేరకు ప్రధానితో ప్రకటన చేయించాలని మరో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మోదీని పవన్ కలిస్తే.. టీడీపీకి ఏమి సంబంధం అని పల్లా శ్రీనివాసరావు ప్రశఅనించారు. ప్రధానిని పవన్ కల్యాణ్ కలిస్తే.. వైసీపీకి ఉలుకు ఎందుకన్నారు. బిజెపి,జనసేన పొత్తు పెట్టుకున్న విషయం వైసీపీ కి తెలియదా అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే ఏపీలోనూ భారీ లిక్కర్ స్కాం జరుగుతోందన్నారు. మద్యం దుకాణాల్లో అసలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం అక్రమాల కోసమేనని పల్లా శ్రీనివాసరావు స్ప్టం చేశారు. తక్షణమే డిజిటల్ పేమెంట్స్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
లిక్కర్ స్కాంలో వైసీపీ నేతల ప్రమేయం.. ఏపీ లిక్కర్ స్కాంపైనా దర్యాప్తునకు డిమాండ్
లిక్కర్ స్కాం లో వైసీపీ నేతలు ప్రమేయం ఉందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. లిక్కర్,ఇసుక లో వైసీపీ నేతలు కోట్లు కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి తమ ఆస్తులపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని.. దమ్ముంటే నిరూపించాలన్నారు. తాను ప్రజల తో ఎన్నిక అయ్యాను..విజయ సాయి రెడ్డి లా దొడ్డి దారిన రాలేదన్నారు. మా ఆస్తుల పై విజయ సాయి రెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామని.. దమ్ముంటే విచారణ చేయించాలని సవాల్ చేశారు. విశాఖలో ప్రతీ రోజూ వైసీపీ నేతల కుంభకోణాలు బయటపడుతున్నాయని వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.
స్థలం కబ్జా కోసమే ఆక్రమణల పేరిట కూల్చివేతలు
విశాఖలో మోదీ పర్యటన సందర్భంగా పార్కింగ్ కోసమంటూ.. ఏయూ సమీపంలోని స్థలంలో ఉన్న దుకాణాలను కూల్చివేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు, కబ్జా చేయడానికే ఇలా కూల్చారని విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతున్నారని వారంటున్నారు. బీజేపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు.