Verma announced that he will work for Pawan Kalyan victory in Pithapuram : పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన అక్కడి ఇంచార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మను చంద్రబాబు బుజ్జగించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వర్మతో చంద్రబాబు మాట్లాడారు. పొత్తుల కారణంగా కొన్ని త్యాగాలు తప్పవని ప్రభుత్వం రాగానే తగిన పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో వర్మ పవన్ కల్యాణ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం రాగానే మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇచ్చి తగిన ప్రాధాన్యం ఇస్తామని వర్మ అనుచరులకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన రోజున వర్మ అనుచరులు పిఠాపురం టీడీపీ ఆఫీసులోని ప్రచార సామాగ్రిని తగులబెట్టారు. దీంతో టీడీపీలోనే వర్మ ఇంత అతిగా స్పందిస్తున్నారన్న అభిప్రాయం వినిపించింది. తాను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని వర్మ తన అనుచరులతో చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఓ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయింది. అయితే అది ఫేక్ లెటర్ గా తేలింది. ఈ క్రమంలో అనుచరులతో సమావేశం అయిన వర్మ.. వారి అభిప్రాయాలను విని.. చంద్రబాబుతో మాట్లాడేందుకు వచ్చారు. చంద్రబాబు హామీలకు చల్లబడ్డారు.
2014లో వర్మ ఇండిపెండెంట్ గా గెలిచి ఉండటంతో ఆయన ఈ సారి కూడా అదే పని చేస్తారన్న ప్రచారం జరిగింది. లేకపోతే వైసీపీ పిలిచి ఆయనకు టిక్కెట్ ఇస్తుందని అనుకున్నారు. కానీ . వైసీపీ కూడా వంగా గీతనే అభ్యర్థిగా ప్రకటించింది. ఇక మార్పులు ఉండే అవకాశం లేదని అంచనాకు వచ్చారు. వర్మ పవన్ కల్యాణ్ కోసం పని చేస్తే.. పిఠాపురంలో .. పవన్ కల్యాణ్‌కు ఊహించనంత మెజార్టీ వస్తుందని కూటమి వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీ తరపున ముద్రగడ పద్మనాభం లేక మరొకరు పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ సిట్టింగ్ కాకినాడ ఎంపీగా ఉన్న .. వంగీ గీతనే పిఠాపురంలో అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు.
‘పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, ఆయన్ని గెలిపించే బాద్యత నాది. గెలుపుని బంగారు పళ్ళెంలో పెట్టి పవన్ కళ్యాణ్‌కి ఇస్తా. పవన్ కళ్యాణ్ ప్రచారానికి కూడా రావాల్సిన అవసరం లేదు..’ అని గతంలో పలుమార్లు చెప్పిన వర్మ పొత్తుల్లో సీటు జనసేనకు పోవడంతో రివర్స అయ్యారు. చివరకు చల్లబడటంతో పవన్ కు ఎలాంటి సమస్యలు లేకుండా పోయినట్లయింది.