AP Election 2024 Schedule: న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ కాలపరిమితి ఈ జూన్ 16వ తేదీతో ముగియనుంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల తేదీలను ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. దాంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని సీఈసీ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు.
ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ - ఏప్రిల్ 18
నామినేషన్లు ప్రారంభం - ఏప్రిల్ 18
నామినేషన్లు తుది గడువు - ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణ - ఏప్రిల్ 29
ఏపీలో ఎన్నికలు - మే 13
ఓట్ల లెక్కింపు - జూన్ 4
4వ ఫేజ్‌లో ఏపీలో ఒకేసారి ఎన్నికలు
దేశ వ్యాప్తంగా మొత్తం 7 దశలలో ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో 4వ దశలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ఈసీ స్పష్టం చేసింది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు ఛాన్స్ ఇచ్చారు. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
గుజరాత్, హర్యానా, జార్ఖండ్, యూపీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 26 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిని మృతిచెందడంతో తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుంది.
దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఓటింగ్ కోసం దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే అధికం. దాదాపు కోటిన్నర మంది అధికారులు ఎన్నికల ప్రక్రియలో భాగం కానున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 55 లక్షల ఈవీఎమ్‌లు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటినుంచే ఓటు (Vote From Home) అవకాశం కల్పించారు.
దేశవ్యాప్తంగా ఓటర్లు ఇలా..
దేశ వ్యాప్తంగా పురుష ఓటర్లు 49.7 కోట్లు ఉండగా, మహిళా ఓటర్లు 47.1 కోట్లు ఉన్నారు. 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉండా, 1.85 కోట్ల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి 1,000 మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 48 వేల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.