యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందని, తెలుగు దేశం పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీకి లేఖ రాశారు.


రాజకీయ ప్రత్యర్దుల కుట్ర...
లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో రాజకీయ ప్రత్యర్దులు, అసాంఘిక శక్తులతో అలజడి రేకెత్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టి పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. పోలీసు శాఖ స్పందించి  కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయని, ఆయన లేఖలో పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో లోకేష్ కు ప్రాణహాని ఉందని అనేకమార్లు ఇప్పటి కే ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. కానీ, సంబంధిత అధికారుల ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.


ఓ వర్గం పోలీసులు కుట్ర ఉంది...
లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రను విఛ్చిన్నం చేసేందుకు ఓ వర్గం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. యువగళం పాదయాత్ర పై ఓ వర్గం పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతో తెలుగు దేశం పార్టి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పై అసభ్యకర పదజాలంతో ప్లెక్సీలు వేశారని అన్నారు. దీనిపై నారా లోకేష్ స్థానిక పోలీసుల అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. అయితే ఆశ్చర్యకరంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి పై డీఎస్పీ నాగరాజు, ఎస్.ఐ రాజారెడ్డి, ఇబ్రహింలు చర్యలు తీసుకోవడం మాని ఫ్లెక్సీలు వేయటాన్ని సమర్ధించారని వర్ల రామయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూన్ 1 న వైసీపీ మద్దతుదారులు పాదయాత్ర చేస్తున్న లోకేష్ పై కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు విసిరారని, అయితే కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు విసిరినవారి వెనుక పోలీసులు ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. లోకేష్ కు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. లోకేష్ పై గుడ్లదాడి గురించి పోలీసులకు ముందే తెలుసని, అయినప్పటికీ రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందారని చెప్పారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను వర్ల రామయ్య కోరారు.


ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలి...
లోకేష్ పై కోడి గుడ్ల దాడి వెనుక పోలీసులు ఉన్నారన్న విషయం జగమెరిగిన సత్యమని, అలాటి వారిపై క్రిమినల్ కేసు బుక్ చేయాలని తెలుగు దేశం పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. పోలీసులు సైతం రాజకీయ పార్టిలకు మద్దతుగా వ్యవహరించటం దారుణమని, అధికారంలో లేనంత మాత్రాన ప్రతిపక్ష పార్టి నాయకులకు రక్షణ కల్పించలేకపోవటం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొన్నారు. లోకేష్ కు రక్షణ కల్పించడంలో తమ బాధ్యతలను విస్మరించిన పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు, అధికార పార్టికి అండగా నిలబడేందుకు ప్రయత్నిచటం బాధాకరమని, అలాంటి వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, నచ్చిన పార్టిలో జాయిన్ అవ్వటం మంచిదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.