నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నేడు ఆఖరి రోజు. చివరి రోజు ఆయన మరింత హుషారుగా కనపడుతున్నారు. యువగళం ముగింపు రోజు కావడంతో ఆయనతో కలసి నడిచేందుకు జనం పోటీ పడ్డారు. లోకేష్ తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధర.. ఇతర కుటుంబ సభ్యులు ఆయనతో కలసి నడిచారు. ఈరోజు యాత్రను పూర్తి చేసిన తర్వాత రేపు గ్యాప్ ఇచ్చి.. ఎల్లుండి(బుధవారం) విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.
చివరి రోజు గాజువాక నియోజకవర్గం జివిఎంసి వడ్లమూడి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు లోకేష్. తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర కుటుంబసభ్యులతో కలసి ఆయన ముందుకు నడిచారు. యాత్ర చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయనతో కలసి నడిచేందుకు గాజువాక వద్దకు చేరుకున్నారు. శివాజీనగర్ వద్ద యువగళం ముగింపు సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు యాత్ర చేపట్టాలనే ఉద్దేశంతో ఆయన యువగళం మొదలు పెట్టారు. అయితే మధ్యలో చంద్రబాబు అరెస్ట్ తో యువగళం యాత్రకు బ్రేక్ పడింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు, ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత లోకేష్ తన యాత్రను తిరిగి మొదలు పెట్టారు. 226 రోజులు ఆయన యాత్ర చేసినట్టయింది. మొత్తం 97 నియోజకవర్గాల్లో యువగళం యాత్ర సాగింది. యాత్ర ముగింపు తర్వాత ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో భారీ బహిరంగ సభ జరుగుతుంది.
బహిరంగ సభకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం నలుమూలలనుంచి టీడీపీ నేతల్ని తరలిస్తున్నారు. బస్సులు, ప్రత్యేక రైళ్లలో విజయనగరంకు టీడీపీ నేతలు వస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక నేతలు జన సమీకరణతో బలప్రదర్శన చేపట్టాలనుకుంటున్నారు.
బిల్డబ్ బాబాయ్ అంటూ నారా లోకేష్ ట్వీట్..
యాత్ర చివరి రోజు కూడా సీఎం జగన్ పై ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు నారా లోకేష్. బిల్డప్ బాబాయ్ ముందు రోడ్లు వెయ్యి అంటూ ట్వీట్ వేశారు.
" బిల్డప్ బాబాయ్ కబుర్లొద్దు... ముందు రోడ్లు వెయ్యి జగన్!
ఇది రాష్ట్రంలోని మారుమూల ఏజన్సీ ప్రాంతంలోని పాడుబడ్డ రహదారి కాదు. అక్షరాలా గ్రేటర్ విశాఖ పరిధిలో నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే స్టీల్ ప్లాంట్ సమీపంలోని గాజువాక కణితిరోడ్డు. ప్రజల నుంచి పన్నుమీద పన్నుతో కోట్లాదిరూపాయలు దోచుకుంటున్న సైకో ప్రభుత్వం విశాఖలాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో రోడ్ల మరమ్మతులు కూడా చేయకుండా గాలికొదిలేసింది. విశాఖ మహానగర రోడ్లపై తట్టమట్టి పోయడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి... రాజధాని చేసేస్తానంటూ బిల్డప్ బాబాయ్ కబుర్లు చెబుతున్నాడు. 10 కి.మీ.ల దూరానికి హెలీకాప్టర్ లో వెళ్లే ఈ రిచెస్ట్ సిఎంకి నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయా? ఆలోచించండి విశాఖ ప్రజలారా...!" అని ట్వీట్ చేశారు లోకేష్.