JC Prabhakar Reddy Comments On Three Wheelers: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని.. వాటిని నిషేధించాలని అన్నారు. మైనర్లు, డ్రైవర్లు మద్యం మత్తులోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అయితే వాటిపై అధికారులు కన్నెతి చూడడం లేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రెండు రోజులు హడావుడి చేసి వదిలేస్తారని మండిపడ్డారు. అనంతపురం (Anantapuram) జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతదేహాలను ఆయన పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సరిపోదని.. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.
ఘోర ప్రమాదంలో 8 మంది మృతి
కాగా, అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు శనివారం ఉదయం గార్లదిన్నె మండలం తిమ్మంపేటలోని ఓ అరటి తోటలో పనికి వెళ్లారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో పనులు ముగించుకుని ఆటోలో తిరుగు పయనమవుతుండగా.. ఆటో తలగాసిపల్లి సమీపంలో హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిని దాటుతుండగా ప్రమాదానికి గురైంది. ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆటోలో పరిమితికి మించి కూలీలను తరలిస్తుండగా ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. అటు, ఘటన జరిగిన ప్రాంతంలో వేగ నిరోధకాలు ఉన్నా బస్సు డ్రైవర్ బ్రేక్ వేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
శోకసంద్రమైన గ్రామం
మరోవైపు, ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందడంతో తీవ్ర విషాదం అలుముకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఆదివారం గ్రామానికి తరలించారు. అధికారులు, పోలీసులు స్వగ్రామానికి వెళ్లారు. మృతదేహాలను ఒక్కసారిగా గ్రామంలోకి తీసుకురావడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అటు, రోడ్డు ప్రమాద ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ ఆదేశాలతో ఉరవకొండ పీఎస్ క్రీడా మైదానంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక లోడుతో వెళ్తున్న ఆటోలకు జరిమానా విధించారు.
రోడ్డు ప్రమాద ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిందన్నారు. మృతి చెందిన కుటుంబంలోని పిల్లల చదువులకు బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.