వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించినవారు లేరని తేలిపోయిందని తెలుగు దేశం పార్టి పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ శాసన సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సక్సెస్ అయినట్లేనంటూ అవినాష్ రెడ్డి బెయిల్ పై ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు లభించింది తాత్కాలిక ఉపశమనమేనని ఆయన అన్నారు.
అవినాష్ బెయిల్ పై టీడీపీ కామెంట్స్...
జగన్మోహన్ రెడ్డి పలుకుబడి, ప్రభావం, అధికారం ముందు సీబీఐ చేసిందంతా తుడిచిపెట్టుకు పోయిందా అన్న అనుమానం ప్రజలకు కలుగుతోందని తెలుగు దేశం పార్టి మాజీ శాసనసభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు ముఖ్యమంత్రి చేసిన ఢిల్లీ పర్యటనలు విజయవంతమయ్యాయనే చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని నిజంగానే అభినందిస్తున్నామని ఎద్దేవా చేశారు. వైసీపీకి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కొత్తకాదన్న విషయం మరో సారి స్పష్టం అయ్యిందని, గతంలో గాలిజనార్థన్ రెడ్డి కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావుని ఏం చేశారో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.
సజ్జల సర్టిఫికెట్....
అవినాశ్  రెడ్డి అమాయకుడని సర్టిఫికెట్ ఇచ్చిన సజ్జల, రాష్ట్రంలోని చిన్నపిల్లల్ని కాకుండా వివేకాను ఎవరు చంపారని తన మనవళ్లను అడిగితే అవినాశ్ రెడ్డేనని  చెబుతారని అన్నారు. దేశవ్యాప్తంగా వివేకానందరెడ్డి హత్యకేసు సంచలన కేసుగా పేరుపొందిందని, కేసుని దర్యాప్తు చేస్తున్నతీరు, సేకరించిన సాక్ష్యాలు సహా ప్రతి అంశాన్నిలోతుగా విశ్లేషించి,  అధునా తన సాంకేతిక పరిజ్ఞానంతో కనిపెట్టామని సీబీఐ చెప్పినప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. దోషులకు శిక్ష పడుతుందని దేశమంతా ఎదురు చూసిందని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.  కానీ వివేకా హత్యకేసులో ముద్దాయిలుగా ఉన్న వారి పాత్రకు సంబంధించి తిరుగులేని సాక్ష్యాలు సీబీఐ వద్ద ఉన్నాయని, ఇది వాస్తవమని చెప్పారు. 2019 మార్చి14వ తేదీ సాయంత్రం, అవినాశ్ రెడ్డి ఇంట్లో నిందితులందరూ కూర్చొని మాట్లాడుకోవడం, కదిరినుంచి గొడ్డలి తెప్పించడం వంటివి గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ కనిపెట్టిందన్నారు. అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్ బయటకువచ్చిందని, 2019 మార్చి15 అర్థరాత్రి 1.30 నిమిషాల నుంచి, తెల్లవారుజామున 5గంటల వరకు జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ మెసేజ్ లు, వాట్సాప్ కాల్స్, ఫేస్ టైమ్ కాల్స్ వివరాలను ఐ.పీ.డీ.ఆర్ (ఇంటర్నేషనల్ ప్రొటోకాల్ డిటెయిల్డ్ రికార్డ్) ద్వారా సీబీఐ బయటపెట్టిందని చెప్పారు.


హత్య తరువాత... ఆధారాలు తారుమారు ఎలా..?
వివేకానందరెడ్డి హత్యజరిగాక ఘటనాస్థలానికి వెళ్లిన మొట్టమొదటివ్యక్తి అవినాశ్ రెడ్డి అని బోండా ఉమా అన్నారు. ఆయన ఆదేశాలతోనే బాత్రూమ్ నుంచి మృతదేహాన్ని బెడ్ రూమ్ కి మార్చారని, రక్తపుమర కలు తుడిచేశారని ఆరోపించారు. అక్కడి పని అమ్మాయి, వాచ్ మెన్ రంగయ్య, ఇతరులు సీబీఐకి చెప్పిన వాంగ్మూలం, ఇతర సాక్ష్యా ల్లో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ తలదన్నేలా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ మెంట్ పనిచేసిందంటే ఆశ్చర్యంగా ఉందని బోండా వ్యాఖ్యానించారు.
సకలశాఖల సలహాదారు సజ్జల  అవినాశ్ రెడ్డి శ్రీరామచంద్రుడు అంటున్నారని, కేసు విచారణను అడ్డుకోవడానికి ఏపీప్రభుత్వం సీబీఐని బెదిరించినట్టు దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయలేదన్నారు బొండా ఉమా. మే 27వతేదీన జగన్మోహన్ రెడ్డి చేసిన ఢిల్లీపర్యటన అవినాశ్ రెడ్డిని కాపాడటంలో విజయవంతమైనట్టే భావిస్తున్నామన్నారు.