Bonda Uma Anger On Police: వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని.. పోలీసులు తనను నిత్యం వేధిస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ (Bonda Uma) ఆరోపించారు. విజయవాడలో (Vijayawada) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు కమిషనర్ పరిధిలోకి వెళ్తారని.. కానీ మన రాష్ట్రంలో అలా జరగడం లేదని మండిపడ్డారు. శుక్రవారం దాదాపు 100 మంది పోలీసులు తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు వచ్చారని.. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సీపీ తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎం జగన్ పై రాయి దాడికి సంబంధించి ఓ మైనర్ ను తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారని అన్నారు. రిమాండ్ లో ఉన్న సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. తాము చెప్పినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే వారి కొడుకు బయటకు రాడు అని సతీష్ పేరెంట్స్ ను భయపెట్టారని ఆరోపించారు. 


'న్యాయ పోరాటం చేస్తా'


'ఈ కేసులో తప్పుడు బర్త్ సర్టిఫికెట్ సృష్టించి మైనర్ ను ఇరికించారు. డీజీపీ, సీపీ, ఏసీపీ అంతా సిండికేట్ గా మారి టీడీపీ అభ్యర్థులపై వేధింపులకు కుట్ర పన్నారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందుతుడు సతీష్ తల్లిదండ్రులను రెండు రోజల నుంచి వేధిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉండే దుర్గారావు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంతవరకు కోర్టులో ఎందుకు ప్రవేశ పెట్టలేదు. 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టాలని తెలియదా.?. రాష్ట్రంలో చట్టం అనేది ఉందా.?. ఎన్నికల కమిషన్ పట్టించుకోదా.?. మొదటి రోజే గవర్నర్ ను కలిసి సీబీఐ ఎంక్వైరీ వేయాలని మేమే అడిగాం. జగన్ తన వ్యవస్థలను ఇప్పటికీ  తన గుప్పెట్లో పెట్టుకున్నారు. వడ్డెర గూడెంలో ఉండడమే దుర్గారావు చేసిన పాపమా.?. ఏ సంబంధం లేని అతన్ని తీసుకెళ్లి ఎక్కడ దాచారో తెలియదు. తప్పుడు కేసు అంగీకరించాలని అతడితో పాటు మహిళలను చిత్రహింసలు పెడుతున్నారు. నా కోసం మొత్తం వడ్డెర గూడేన్ని ఇబ్బంది పెడతారా.?. నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూసే వారిని ఊరికే వదిలిపెట్టను. తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయ పోరాటానికి దిగుతా.' అని బొండా ఉమ స్పష్టం చేశారు..


సీపీ కార్యాలయం వద్ద ఆందోళన


మరోవైపు, వడ్డెర కుల సంఘం నాయకులు సీపీ కార్యాలయం వద్దకు శనివారం భారీగా చేరుకున్నారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఏ2గా పోలీసులు భావిస్తున్న దుర్గారావును తమకు చూపించాలని అతని భార్య, కుటుంబ సభ్యులు, వడ్డెర సంఘం నేతలు ఆందోళన నిర్వహించారు. సీపీని కలిసేందుకు యత్నించగా అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసన తెలపగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.


మరోవైపు, సీఎం జగన్ పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న నిందితుడు సతీష్ ను గురువారం విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా సతీష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 'సీఎం జగన్ కు ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డాడు. డాబా కోట్ల సెంటర్ లో దాడి చేసేందుకు యత్నించాడు. వివేకానంద స్కూల్ పక్కన ఉన్న బెంచ్ దగ్గరకు వెళ్లి సతీష్ రాయితో దాడి చేశాడు. అక్కడ తోపులాట ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కేసులో ఏ2 ప్రోద్బలంతోనే సతీష్ దాడి చేశాడు.' అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు.


Also Read: Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!