TDP Janasena and BJP leaders meeting: అమరావతి: తొలి భేటిలోనే సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయకుండగా, బీజేపీ - జనసేనకు కలిపి 31 అసెంబ్లీ సీట్లు, 8 లోకసభ స్థానాల్లో బరిలోకి దిగానున్నాయి. ఇందులో జనాసేన 21 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో, బీజేపీ 6, జనసేన 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. కీలకమైన తొలి భేటీలో టీడీపీ ఒక్క సీటు, జనసేన మూడు సీట్లు ఇవ్వడంతో బీజేపీకి మరో 4 అసెంబ్లీ స్థానాలు పెరిగాయి. మంగళవారం అభ్యర్థులు, సీట్లపై మరోసారి సమావేశం కానున్నారు.


ప్రధాని మోదీ నాయకత్వంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూటమి పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రజల స్థితి గతులు మెరుగు పరిచేందుకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని, ఎన్డీఏ భాగస్వాములుగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. తమ కూటమిని ఆశీర్వదించాలని ఏపీ ప్రజలను చంద్రబాబు కోరారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి తమను గెలిపించి, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.


3 పార్టీలు సుదీర్ఘ భేటీ 
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల సమావేశం సోమవారం రాత్రి ముగిసింది. మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటలపాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సీట్ల సర్దుబాటు, కూటమి వ్యూహాలపై సమావేశం కొనసాగింది. కూటమి సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండాలు నోవాటెల్ హోటల్ కు వెళ్లిపోయారు. భేటీలో పాల్గొన్న ఇతర టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు నివాసం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై ఏం జరిగిందని కాసేపు చర్చించినట్లు సమాచారం. మరోవైపు షేకావత్, పాండాలు బీజేపీ అధిష్టానానికి భేటీ సారాంశాన్ని వివరించనున్నారు. ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గైర్హాజరయ్యారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని వేరే కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె స్పష్టం చేశారు.