తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో జనసేనతో సమన్వయం కోసం ప్రత్యేకంగా కమిటీ నియమించింది. సభ్యులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యరో సభ్యులు, శాసనమండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు, పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నియమించారు. వీరంతా ఇరు పార్టీల సమన్వయం కోసం పని చేయనున్నారు. 


చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైఖరి దారుణం


చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైఖరి దారుణమన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై మానవతాదృక్పథంతో వ్యవహరించాలన్న ఆయన, ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదని సూచించారు. జైళ్లశాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం జనసేనాని పవన్ కల్యాణ్, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిశారు. ములాఖత్ తర్వాత బయటకు వచ్చిన పవన్ కల్యాణ్, వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. యుద్ధం కావాలంటే యుద్ధానికి సిద్ధమేనన్న ఆయన, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


ఆంధ్రప్రదేశ్ దుస్థితిపై ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు వచ్చే ఎన్నిక్లలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. సైబరాబాద్ ను నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం దారుణమన్న పవన్, వైసీపీ నేతలు తమపై రాళ్లు వేసేటప్పుడు ఆలోచించుకోవాలనిక హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కర్ని వదలబోమని హెచ్చరించారు. 2014లో బీజేపీ, టీడీపీ కు మద్దతిచ్చేందుకు కూడా ముఖ్యకారణం ఉందన్న పవన్, విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉండొచ్చని, చంద్రబాబు అనుభవం, అసమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిపై తప్పుడు కేసులా? రూ.317 కోట్లు స్కామ్ అని చెబుతున్నారని మండిపడ్డారు. 


నెలరోజులకుపైగా జైల్లో చంద్రబాబు


స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నెలరోజులకు పైగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది.