TDP Finalizes Rajya Sabha Candidates | అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP) రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీశ్, చింతకాయల విజయ్‌ల పేర్లను పార్టీ అధిష్ఠానం శనివారం నాడు ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికలో సోషల్ బ్యాలెన్స్, పార్టీ పట్ల అంకితభావం, యువతకు పెద్దపీట వేసేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం (జూన్ 8న) తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు గాను, కూటమి ఒప్పందంలో భాగంగా తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను, జనసేన పార్టీ ఒక స్థానాన్ని తీసుకున్నాయి. ఇందులో జనసేన కోటాకు సంబంధించిన స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇప్పటికే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేసి ఇదివరకే తమ మద్దతును తెలిపారు.
జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీ తన అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ను బరిలోకి దింపింది. శనివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతుల మీదుగా ఆయన అధికారిక 'బి-ఫామ్' అందుకున్నారు. ఈ సందర్భంగా పెద్దల సభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం లింగమనేని బలంగా గళం వినిపిస్తారని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం వెలగపూడిలోని శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బీజేపీ ఎమ్మెల్యే ఎన్. ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. లింగమనేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్‌తో పాటు కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలు ప్రతిపాదన సంతకాలు చేశారు. పారిశ్రామికవేత్త అయిన లింగమనేని ఎంపిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
తనపై నమ్మకంతో రాజ్యసభ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మోదీ, చంద్రబాబులకు ధన్యవాదాలు చెబుతూ, ఏపీ ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రమేష్ గారు అత్యంత సమర్థుడని, పవన్ కళ్యాణ్ సరైన వ్యక్తిని ఎంపిక చేయడం పార్టీ శ్రేణులందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తోందని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రశంసించారు.
