Chandrababu About Jagan: వెంట్రుక కూడా పీకలేరన్నాడు, ఎలక్షన్లకు ముందే జగన్ ఓటమి అంగీకరించారు: చంద్రబాబు
ABP Desam | 27 Jan 2024 10:46 PM (IST)
TDP News: 2021లో ఎవరూ కూడా నా వెంట్రుక పీకలేడన్నాడు, ఇప్పుడు జగన్ తన ఓటమిని అంగీకరించాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఉరవకొండ: ‘మీ ఉత్సాహాన్ని చూశాడంటే సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan)కు నిద్ర పట్టదు. ఆయనకు ఈ 74 రోజులు నిద్ర కరువయ్యేది ఖాయం. ఎక్కడ చూసినా జగన్ ను జనం ఛీ కొడుతున్నారు. జగనే ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నాడని’ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chanrababu) అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన రా! కదలి రా! సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రమంతా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోంది. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టారు. ఇందుకు సాక్ష్యం ఇక్కడున్న పోలీసులే అని చంద్రబాబు అన్నారు. ఇక్కడికి వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలే. జగన్ సభలకు తరలించిన జనం కాదన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14కి14 నియోజకవర్గాలు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
‘ఇటీవలే జగన్ తన ఓటమిని అంగీకరించాడు. జగన్ కు తాను ఓడిపోతున్నట్లు అర్థమైపోయింది. ఆయన ఓడిపోతున్నాడని సర్వేలు సైతం వచ్చాయి. జగన్ కు ఉన్న గర్వమంతా ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. 2021లో ఎవరూ కూడా నా వెంట్రుక పీకలేడన్నాడు. అప్పుడు మనిషిలో అహంభావం పూర్తిగా ఉండేది. 2022లో ప్లీస్ నన్ను నమ్మండి ప్లీస్ నన్ను నమ్మండి అన్నాడు. 2023లో నాకు ఎవరి మీద నమ్మకం లేదు, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అని అన్నాడు. 2024లో నేను హ్యాపీగా దిగిపోతా అంటున్నాడు. జగన్ ఖేల్ ఖతమ్ అని ఆయనే ధృవీకరించుకున్నాడు’ అన్నారు చంద్రబాబు.
జగన్ వచ్చి అడ్డు తగిలాడని, లేకపోతే ఇరిగేషన్ ఎంతో అభివృద్ది జరిగి ఉండేదన్నారు చంద్రబాబు. 50 వేల ఎకరాల్లో ఇరిగేషన్ అభివృద్ది చెంది ఉంటే అనంతపురం జిల్లాలో ప్రతి రైతు బాగుపడేవాడు. ఒకప్పుడు దేశానికి కూరగాయలు సరఫరా చేసిన ఏకైక జిల్లా అనంతపురం జిల్లా అన్నారు. వైసీపీ మాయ మాటలు నమ్మొద్దు, టీడీపీ అధికారంలో ఉన్నప్పపుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఇక్యూమెంట్లను పంపిణీ చేశామని... జగన్ వచ్చి వాటన్నింటిని నాశనం చేశారంటూ మండిపడ్డారు.
ఆలుగడ్డకు, ఉల్లి గడ్డకు తేడా తెలియదు
జగన్ కు బుద్ది లేదు, రైతులకు ఇచ్చిన ఇక్యుప్ మెంట్ ల వల్ల 30 కోట్లు వృధా అయిందని.. జగన్ చేస్తున్న పనుల పట్ల నిరసన తెలియజేయాలన్నారు. ఆలుగడ్డకు, ఉల్లి గడ్డకు తేడా తెలియదు. అందుకే బీమా పథకాన్ని తీసేశాడని సెటైర్లు వేశారు. మళ్లీ బీమా పథకం తెచ్చే బాద్యత టీడీపీ, జనసేన ది. ఎక్కడ పోయినా జనం ఉత్సాహం, అభిమానం చూపిస్తున్నారు. వైసీపిని భూస్థాపితం చేయాలి. డీఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఇంకా ఎవరిని మోసం చేస్తారు? అని ప్రశ్నించారు.
‘అనంతపురంలో కియా మోటార్ పరిశ్రమ పెట్టి 12 లక్షల కార్లు ఉత్పత్తి చేశాం. ఇక్కడ తయారైన కార్లు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాయి. వైసీపీ అమర్ రాజాను తరిమేశారు. మేం రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చాం. వైసీపీ పరిశ్రమలను తరిమేశారు. మళ్లీ ఉద్యాగాలు కావాలా? వద్దా? జాబు రావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే సైకిలెక్కండి, యువతకు హామీ ఇస్తున్నా. 4 లక్షల ఉద్యోగాలు 25వేల ఉద్యోగాలిస్తాం. కంపెనీలు తీసుకొస్తాం. పరిశ్రమలు వస్తాయి. వర్క్ ఫ్రం హోం కు శ్రీకారం చుడతాం. ఉద్యోగాలే మీ డోర్ కొట్టేలా చేస్తాను. హామి ఇస్తాం. అమ్మా నాన్న పైన ఆధార పడాల్సిన అవసరంలేదు. నేనున్నప్పుడు కరెంటు కోత ఉండేదా? కరెంటు చార్జీలు తగ్గిస్తాము గాని పెంచము. వైసీపీని నమ్మి ఓటేశారు. నిండా మునిగారు’ అన్నారు.