Chandrababu letter To AP DGP: అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మీడియాపై దాడులకు కారణమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
లేఖలో పేర్కొన్న అంశాలు ఇవే..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీడియాపై దాడులు పెరిగిపోయాయి.. మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోంది. మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పై దాడులు నిత్యకృత్యమయ్యాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో కుట్రపూరితంగా వైసీపీ రౌడీలు మీడియాపై దాడులను తీవ్రతరం చేశారు. గత వారం రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు దాడులను డీజేపీకి రాసిన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.
అమరావతిలో న్యూస్ టుడే కంట్రీబ్యూటర్ పరమేశ్వరరావు, రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణ, కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి, మద్దికెరలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వీరశేఖర్ పై దాడులు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. చొక్కా చేతులు మడతపెట్టండి అంటూ ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడమే రాష్ట్రంలో నేటి పరిస్థితికి కారణం అని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ దాడులను ఖండించకపోగా వాటిని ప్రోత్సహించేలా వ్యాఖ్యానించారని, ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఈ దాడులు జరుగుతున్న కారణంగా సీఎం జగన్‍పై చర్యలు తీసుకోవాలని డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డికి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.